Telugu Gateway
Politics

మరో వివాదంలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్

మరో వివాదంలో ఢిల్లీ సిఎం  కేజ్రీవాల్
X

ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆయనకు ఇది కొత్త తలనొప్పిగా మారింది. ఇదే అదనుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అరవింద్ కేజ్రీవాల్ పై మండి పడుతున్నాయి.పేరు లో ఆమ్ ఆద్మీ అని పెట్టుకుని..ఇంత విలాసవంతమైన ఏర్పాట్లు...ప్రజాధనం ఖర్చు చేయటమా అని తప్పుపడుతున్నాయి. ఒక జాతీయ మీడియా దీనికి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. ఆపరేషన్ శీషుమహల్ పేరుతో టైమ్స్ నౌ నవభారత్ ఈ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని 45 కోట్ల రూపాయలతో రిపేర్ చేయించారు...ఇందులో కేవలం కర్టెన్స్ కోసం 97 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగా...వియత్నాం నుంచి మూడు కోట్ల రూపాయలు పెట్టి మార్బల్స్ దిగుమతి చేసుకున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో పెట్టిన ఒక్కో కర్టెన్ ఖరీదు ఐదు నుంచి ఎనిమిది లక్షల రూపాయలుగా ఉంది. 97 లక్షల రూపాయల ఖర్చుతో మొత్తం 23 కర్టెన్స్ కేజ్రీవాల్ ఇంట్లో పెట్టారు. ఇలా ఒకటేమిటి సీఎం అధికారిక నివాసం లో అన్నీ విలాసాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆరు కార్పెట్స్ ను సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేశారు. అయితే ఈ ఖర్చు పై అప్ నేతలు కూడా స్పందించారు. సీఎం నివాసం ఏ మాత్రం నివాసయోగ్యంగా లేకపోవటంతో కొత్తగా నిర్మించారు అని చెపుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత రాఘవ చద్దా ప్రకటన చేశారు. 80 ఏళ్ళ పురాతన భవనం కావటంతో దీని పునర్ నిర్మించారు అంటూ అయన వివరణ ఇచ్చారు.

Next Story
Share it