నెక్ట్స్ అరెస్ట్ ఎవరో నాకు తెలుసు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తర్వాత ఎవరిని అరెస్ట్ చేయనుందో తనకు తెలుసన్నారు. ఇటీవలే హవాలా ఆరోఫణలతో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిందే తప్ప..అందులో ఎలాంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవినీతికి ఆధారాలు ఉంటే విచారణ ఏజెన్సీల కంటే ముందే తాము నిర్ణయం తీసుకునేవారమన్నారు. తాజాగా పంజాబ్ లో ఓ మంత్రిపై అవినీతి ఆరోపణలు రాగా..మంత్రివర్గం నుంచి తొలగించి ఏకంగా అరెస్ట్ కూడా చేయించారు.
ఇది దేశంలో పెద్ద సంచలనంగా మారింది. కేంద్రం తదుపరి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోందని విమర్శించారు. మమ్మల్ని అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి విచారణ జరిపించండి.. మేం అందరం మళ్లీ త్వరగా డ్యూటీలో చేరిపోవాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మాకు ఈ రాజకీయాలు అర్ధం కావటం లేదు..అభివద్ధి చేయాలనుకుంటున్నామని తెలిపారు.