గత్యంతరం లేకే ఇలా చేయాల్సి వచ్చింది
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనను పక్కదారి పట్టించి తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు కొంత మంది రెడీ అయ్యారని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. టీడీపీ, బిజెపి నేతలు దీనిపై రాజకీయం చచేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన ఉన్నా..బాధతోనే పీఆర్సీ విషయంలో..గత్యంతరం లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. కొత్త పీఆర్సీతో వేతనాలు తగ్గుతాయన్నది ఏ మాత్రం నిజంకాదన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న విధానమే ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. అన్ని అంశాలు తెలిసి కూడా కొందరు వక్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా 27 శాతం ఐఆర్ ఇచ్చామని పేర్ని నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన నెలలోపే ఐఆర్ ప్రకటించారని తెలిపారు. ఐఆర్ కింద రూ.17, 918 కోట్లు ఇచ్చామని చెప్పారు. యూనియన్ నేతలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 23 శాతం ఫిట్మెంట్‌ను కాంట్రాక్టర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇస్తున్నామన్నారు. ఇవన్నీ ఉద్యోగుల పట్ల ప్రేమలేకనే చేస్తున్నామా అని మంత్రి ప్రశ్నించారు. ఐఆర్‌ను జీతంలో భాగంగా ఎలా పరిగణిస్తారు?. హెచ్‌ఆర్‌ఏ అనేది జీతభత్యాల్లో భాగం కాదా?. ఉద్యోగులు ఆశించనమేరకు చేయలేకపోయినందుకు బాధగానే ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చింది. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దు అని పేర్నినాని కోరారు.