Telugu Gateway
Politics

తోక‌పార్టీల‌తో చంద్ర‌బాబు కుట్ర‌

తోక‌పార్టీల‌తో చంద్ర‌బాబు కుట్ర‌
X

అమ‌రావ‌తి రైతుల బ‌హిరంగ స‌భ‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స్పందించారు. మూడు రాజ‌ధానుల‌కే త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని..ఇదే అంశం అసెంబ్లీలో స‌మ‌గ్ర బిల్లు ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పెద్దిరెడ్డి వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లో... ' మూడు రాజధానులకే మేం కట్టుబడి ఉన్నాం. రాజధాని పేరుతో చేసింది రైతు ఉద్యమం కాదు. ఈ ఉద్యమంలో రైతులు ఎవరూ లేరు. టిడిపి ఈ ఉద్యమంను నడిపించిందనేది బట్టబయలు అయింది. అమరావతిలో భూములకు రేట్లు పడిపోయాయనే ఆక్రోశంతోనే ఈ ఉద్యమం. ఇది కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారం. అమరావతిలో వేల కోట్లతో కొన్న భూములను పరిరక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం. తోకపార్టీలను కలుపుకుని చంద్రబాబు చేస్తున్న కుట్ర. కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్ట్‌ల కలయిక అనైతికం. బిజెపితో జత కట్టడానికే చంద్రబాబు తంటాలు. రఘురామకృష్ణ రాజు నీతిలేని వ్యక్తి. మా పార్టీ నుంచి ఫిరాయించిన వారికి మాట్లాడే నైతిక అర్హత లేదు.' అని వ్యాఖ్యానించారు.

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ ఉంది? బిజెపికి ఒట్లు ఎక్కడ ఉన్నాయి? వాటిని కలుపుకుని చంద్రబాబు మా ప్రభుత్వంపై బురదచల్లుతున్నాడు. రానున్న రోజుల్లో బిజెపితో జత కట్టేందుకే చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రబాబు ఏ పార్టీతో జతకట్టినా, ఎన్ని తోకపార్టీలను కలుపుకున్నా సరే వైయస్‌ఆర్‌ సిపి మాత్రం ఒంటరిగానే పోరాడుతుంది. ఇటువంటి అనైతిక కలయికలకు మా నాయకుడు జ‌గ‌న్ వ్య‌తిరేకమ‌న్నారు. తిరుపతి సభలో చంద్రబాబు ఓపెన్‌గా మాట్లాడటం లేదు. అవును మేం అమరావతిలో వేల ఎకరాల భూములు కొనుగోలు చేశాం. అందుకే అక్కడే రాజధాని కావాలని కోరుతున్నాం. కోర్టులు కూడా మాకు మద్దతు ఇస్తున్నాయి అని చంద్రబాబు ప్రకటిస్తే మాకు అభ్యంతరం లేదు.

ఆనాడు హైదరాబాద్‌లోనూ హెటెక్‌ సిటి అని ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఒకే సామాజిక వర్గం అక్కడ భూములు కొనుగోలు చేసి కోట్లకు పడగలెత్తాయి. తిరిగి అమరావతిలో కూడా అలాగే చేయాలని చంద్రబాబు ప్రయత్నం. సీఎం జగన్ నిర్ణయంతో నష్టపోతున్నామని భావించి రైతుల పేరుతో ఈ ఉద్యమం చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి, ఈ భూముల రేట్లను పరిరక్షించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు అనుకుంటున్నట్లు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్ర చేశామంటూ న్యాయస్థానంతో పాటు తిరుమల వెంకటేశ్వరస్వామి కూడా తమకే మద్దతు ఇస్తున్నారని చంద్రబాబు ఎలా చెప్పుకుంటున్నారు? అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it