Telugu Gateway
Politics

మేం నీళ్లు..విద్యుత్ ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ నడుపుతారా?

మేం నీళ్లు..విద్యుత్ ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ నడుపుతారా?
X

మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

ఏపీ దేశంలో భాగం కాదా?

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదు సరే.. ప్రభుత్వం నీళ్లు, విద్యుత్ ఇవ్వకుండానే ప్లాంట్ నడుస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా ఆ ప్రాంతంలో యూనిట్ నడపటం సాధ్యం అవుతుందా అన్నారు. పార్లమెంట్ లో బలం ఉందని బిజెపి ఇష్టానుసారం చేస్తోందని విమర్శించారు. దేశంలో ఏపీ భాగం కాదా? ఇక్కడి ప్రజల మనోభావాలను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను రక్షించేందుకు ఢిల్లీలో కూడా పాదయాత్ర చేయటానికి తాము రెడీ అన్నారు. గల్లీతోపాటు ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామన్నారు. ప్రతిపక్షాలు కూడా రాజకీయాలు మాని ప్లాంట్ రక్షణ కోసం ప్రభుత్వంతో కలసి రావాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోరని, త్వరలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేపడతామని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో ఎలా నడిపించాలనే అంశంపై సీఎం జగన్‌ ప్రధాని మోదీకి రెండో సారి లేఖ రాశారని వివరించారు. సీఎం జగన్‌ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రజల ఆకాంక్షను, సెంటిమెంట్‌ను ప్రధానికి వివరిస్తారని వెల్లడించారు. సొంత గనులు లేకపోవడం ప్లాంట్‌ నష్టాల బాట పట్టడానికి మరో కారణమని తెలిపారు. కేంద్రం సొంత గనులు కేటాయిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. రుణభారాన్ని మూలధనంగా మార్చాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం కేవలం నష్టాలను మాత్రమే చూపించడం సరికాదని అన్నారు. రాజనామాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. పదవులు వదులుకుంటే కనీసం ప్రధాని అపాయింట్ మెంట్ కూడా దొరకదన్నారు. ప్రత్యేక హోదాతోపాటు, స్టీల్ ప్లాంట్ విషయంలో అధికార బిజెపి వైఖరి ఏ మాత్రం సరికాదన్నారు.

Next Story
Share it