Telugu Gateway
Politics

జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వా

జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వా
X

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ హ‌వా చాటింది. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా రాష్ట్ర‌మంత‌టా ఏక‌ప‌క్షంగా ఫ‌లితాల‌ను సాధించింది. అయితే నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత అధికార వైసీపీ బెదిరింపుల‌కు పాల్ప‌డుతుంద‌నే ఆరోప‌ణ‌ల‌తో తెలుగుదేశం పార్టీ బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయినా కొన్ని చోట్ల అభ్య‌ర్ధులు బ‌రిలో నిలిచారు. పార్టీ అధికారికంగా ఎన్నిక‌ల‌ను బాయ్ కాట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టంతో చాలా చోట్ల అభ్య‌ర్ధులు వ‌దిలేశారు. కొంత మంది మాత్రం వ్య‌క్తిగ‌తం స‌త్తా చాటాల‌నుకున్న వారు మాత్ర‌మే బ‌రిలోకి దిగారు. ఎప్పుడో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి హైకోర్టు ఆదేశాల‌తో ఫ‌లితాలు ఆదివారం నాడు వెల్ల‌డ‌య్యాయి. ఈ ఫ‌లితాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీల‌ను వైసీపీనే పూర్తి స్థాయిలో ద‌క్కించుకుంది. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం మాత్రం అక్క‌డ‌క్క‌డ విజ‌యాల‌ను న‌మోదు చేసింది. ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌లేదు. ఒక్క చంద్ర‌బాబుకే కాదు..ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడిదీ అదే ప‌రిస్థితి. అత్యంత కీల‌క‌మైన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది.

ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా జెడ్పీటీసీ రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలు కైవసం చేసుకుంది. ఒక్క తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తుది ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఎంపీటీసీ ఫ‌లితాల్లోన అదే ట్రెండ్. అయితే వైసీపీకి అత్యంత కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని దుగ్గిరాల మండలం లో పోటీ చేసిన 14 స్థానాల్లో 9 చోట్ల ఘన విజయం సాధించిన టీడీపీ. అది కూడా భారీ మెజారిటీలతో వైసీపీ అభ్యర్థుల పై టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్ర‌మంత‌టా వైసీపీ జోష్ సాధించ‌గా..రాజ‌ధాని ప్రాంతంలోని మంగ‌ళ‌గిరిలో ఆళ్ల రామ‌క్రిష్ణారెడ్డికి వ్య‌తిరేక గాలి వీయ‌టం కీల‌కంగా మారింది. అయితే స్థానిక సంస్థ‌ల ఫ‌లితాల‌పై టీడీపీ స్పందించింది. తాము వ‌దిలేసిన ఎన్నిక‌ల్లో గెలిచారు త‌ప్ప‌..ఇది వైసీపీ విజ‌యం కాద‌ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it