ఏకగ్రీవాల అంశం..ఎస్ఈసీ ఆదేశాలు కొట్టేసిన ఏపీ హైకోర్టు
ఏపీ ఎస్ఈసీకి మరో అంశంలో హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఏకగ్రీవాల రద్దు చేయటంతోపాటు ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది. తక్షణమే ఎంపికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఎన్నికలకు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పోయాయి. అయితే మార్చి నెలాఖరున పదవి విరమణ చేయనున్న రమేష్ కుమార్ ఈ ఎన్నికలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుంటారా? లేక కొత్తగా వచ్చే ఎస్ఈసీకి ఈ బాధ్యతలు వదిలేసి వెళతారా అన్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.