Telugu Gateway
Politics

స్వర్ణయుగం దిశగా పాలన

స్వర్ణయుగం దిశగా పాలన
X

ఊహించిందే జరిగింది. టీడీపీ, జన సేన కూటమిలో చేరిన బీజేపీ పై వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేయకుండా వదిలేశారు. మేదరమెట్ల సిద్ధం సభలో ఎప్పటిలాగానే టీడీపీ, జన సేన లపై విమర్శలు గుప్పించారు. నోటా కు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ కూటమిలో చేరింది అంటూ బీజేపీ పై పరోక్ష విమర్శలు చేశారు. తన మీద, పేదల భవిష్యత్ మీద దాడి చేయటానికి సిద్ధంగా ముగ్గురు కలిశారు అంటూ టీడీపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. మరో జాతీయ పార్టీ చంద్రబాబు జేబులో ఉంది అంటూ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి వైసీపీ కి పోటీకి అటు వైపు ఉన్నారు అన్నారు. అర డజను పార్టీలు..అర డజను మీడియా సంస్థలు వైసీపీ కి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ఆ పార్టీ లకు సైన్యాధిపతులు ఉన్నారు కానీ...సైన్యం లేదు ఎద్దేవా చేశారు. వైసీపీ, జగన్ ప్రజా బలం ముందు నిలబడలేక ..దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోకరిల్లాడు అంటూ చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేశారు.

చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెత్తించికపోతే ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతున్నాడు అని ప్రశ్నించారు. ఒక వైపు పేదలను గెలిపించాలని తాను చూస్తుంటే మరో వైపు తనను ఓడించేందుకు అందరూ ఏకం అవుతున్నారు అని జగన్ టీడీపీ కూటమిని టార్గెట్ చేశారు. జగన్ మార్క్ రాజకీయంలో విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మనం ప్రారంభించిన పాలన స్వర్ణ యుగం వైపు వెళుతోంది. అధికారం పోతుంది అనే భయం జగన్ కు ఎప్పడూ రాదూ ...ఉండదు అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు జగన్ పేరు ఉండేలా తన పాలన ఉండాలన్నదే తన విధానం అని వెల్లడించారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని..అందులో ఖచ్చితంగా అమలు చేయగలిగిన హామీలే ఇస్తామన్నారు.

Next Story
Share it