చంద్రబాబు మొహం చూడాలనుంది...జగన్
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై సీఎం జగన్ గురువారం నాడు పదే పదే వ్యంగాస్త్రాలు సంధించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పం మునిసిపాలిటీని వైసీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన బీఏసీ సమావేశంలో కుప్పంలో ఓటమి పాలైన చంద్రబాబు మొహం ఓ సారి చూడాలని ఉంది అంటూ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితో జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని..చంద్రబాబు ఖచ్చితంగా సభకు వస్తారని చెప్పారు. 'అయినా బీఏసీలో ఎన్నికల గురించి ఎందుకు? మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు' అని అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. అయినా సీఎం జగన్ అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడిందని మా వాళ్లు అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆయనకున్న కష్టం ఏంటో నాకైతే తెలియదు. బీఏసీని కొంత ఆలశ్యం చేసినా ఆయన సమావేశానికి చంద్రబాబు బీఏసీకి రాలేదన్నారు. తాము రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తుంటే టీడీపీ, చంద్రబాబు ప్రతి పనినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కుప్పంలో కూడా దేవుడు మొట్టికాయలు వేశారని ఎద్దేవా చేశారు. కుప్పం మునిసిపాలిటీ, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్లను గెలుచుకోవటంపై సీఎం జగన్ ఫుల్ కుషీకుషీగా ఉన్నారు. బుదవారం నాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గురువారం ఉదయం నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ ఆయనతో సమావేశం అయిన సమయంలో జగన్ లో ఆనందం ఆయన నవ్వు లో స్పష్టంగా కనపడిందని చెప్పొచ్చు. ఎప్పుడూ లేనంత మనస్పూర్తిగా ఆయన ఈ విజయాలను ఆస్వాదించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.