Telugu Gateway
Politics

ప్రచారంలో ‘జగన్ ఓ ఆణిముత్యం’

ప్రచారంలో ‘జగన్ ఓ  ఆణిముత్యం’
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రచారం పీక్ కి వెళ్ళింది. మంగళ వారం నాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఒక జాకెట్ యాడ్ లోనే సీఎం జగన్ పేరుతో ఒక్క విద్యా శాఖలోనే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విదేశీ విద్య దీవెన పేరుతో పథకాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో పదవ తరగతి, ఇంటర్ చదువుతూ మంచి మార్కులు సాధించిన వారికి స్టేట్ బ్రిలియంట్ అవార్డ్స్ పేరుతో అవార్డులు ఇచ్చారు. దీనికి కూడా జగనన్న ఆణిముత్యాలు అనే పేరు పెట్టారు. ఎప్పటిలాగానే దీనికి కూడా కోట్ల రూపాయల వ్యయంతో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో జాకెట్ యాడ్స్ ఇచ్చారు. విద్యా శాఖే కాకుండా మిగిలిన శాఖల్లో కూడా జగన్ పేరుతో ఉన్న పథకాలు పేర్లు లెక్క తీస్తే ఎన్ని తేలతాయో ఎవరికీ తెలియదు. ప్రభుత్వంలో కొత్తగా ఏమి మొదలుపెట్టినా సరే ముందు దానికి జగనన్న పేరు యాడ్ చేయటమే. అందులో భాగంగానే ఇప్పుడు ఈ జగనన్న ఆణిముత్యాలు పుట్టుకొచ్చింది. ప్రతి దానికి ఇలా సీఎం పేరు తగిలించుకోవటం అలవాటుగా మారిపోయింది. ఈ ప్రచార పిచ్చి ఇప్పటిలో ఆగే అవకాశాలు కనిపించటం లేదు.

ఇదే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అప్పటికి టీడీపీ ప్రభుత్వంలో పలు పథకాలకు చంద్రబాబు తన పేరుపెట్టుకోవటంపై మండిపడింది. ప్రతిదానికి చంద్రన్న పేరు ఏంటి ...ఈ పథకాల అమలుకు చంద్రబాబు ఏమైనా తన తండ్రి ఖర్జుర నాయుడు సంపాదించిన డబ్బులు ఖర్చుపెడుతున్నారా అంటూ ఇప్పటి మంత్రి రోజా అప్పటిలో వైసీపీ పార్టీ ఆఫీస్ వేదికగా చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వైసీపీ పార్టీ ఆఫీస్ వేదికగా మాటలు అంటే అవి జగన్ ఆమోదం లేకుండా వచ్చినవి కావు అనే భావించాలి. మరి ఇప్పుడు మంత్రి రోజా...గతంలో చంద్రబాబు పేరు పెట్టుకున్నప్పుడు తప్పు పట్టాం అనే విషయం సీఎం జగన్ కు చెప్పరా?. చెప్పినా కూడా మన స్టాండ్ ప్రతిపక్షంలో ఉంటే ఒకటి...అధికారంలో ఉంటే ఒకటి అని జగన్ లైట్ తీసుకుంటారా అంటే ఇదే నిజం అని నమ్మే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. అమలు అవుతున్న పథకాల వాయిదాల విడుదలకు కూడా ఒక స్కీం ప్రకారం పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తూ వైసీపీ సర్కారు కొత్త సంప్రదానికి శ్రీకారం చుట్టింది అనే చెప్పాలి. వైసీపీ సర్కారు తీరు చూసిన అధికారులు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకోవటంలో జగన్ గత ముఖ్యమంత్రులు అందరిని అధిగమించారు అని చెపుతున్నారు. ఇంత భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటూ కూడా ప్రచారంలో తాము వీక్ అని చెప్పుకోవటం కూడా వైసీపీ కే చెల్లింది.

Next Story
Share it