చంద్రబాబు తీరును ఖండిస్తూ అసెంబ్లీ తీర్మానం
ఏపీ శాసనసభలో సోమవారం నాడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏకంగా పోడియంలోకి వెళ్లి సభలో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేయటం, సభా నాయకుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ సభ్యులనుద్దేశించి కళ్ళు చుట్టు చేతులు పెట్టుకుని యాక్షన్ చేయటం చోటుచేసుకున్నాయి. చంద్రబాబు తీరును వైసీపీ తప్పుపడితే..ముఖ్యమంత్రి వ్యవహరించే తీరు ఇదేనా అంటూ విపక్షం విరుచుకుపడింది. అయితే చంద్రబాబు సభలో ప్రవర్తించిన తీరును ఖండిస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేసింది.
ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తీర్మానాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామన్నారు. సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సభలో దురదృష్టకరమైన పరిణామం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ప్రతిపక్ష నేత కన్‌ఫ్యూజన్‌లో పడ్డారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. సీఎం జగన్ కూడా చంద్రబాబునుద్దేశించి విమర్శలు గుప్పించారు. రౌడీలా ప్రవర్తిస్తూ మళ్లీ తనకు ఏదో అన్యాయం జరిగినట్లు వ్యవహరిస్తారని మండిపడ్డారు.