Telugu Gateway
Politics

రాహుల్ ను ఒబామా కూడా వదల్లేదు

రాహుల్ ను ఒబామా కూడా వదల్లేదు
X

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఈ మధ్య కాలం ఏ మాత్రం కలసి రావట్లేదు. ఎక్కడ చూసినా ఎదురుదెబ్బలే. తాజాగా ముగిసిన బీహార్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు ఎక్కువ..గెలిచింది తక్కువ. తేజస్వి యాదవ్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణం అని ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాహుల్ ఇమేజ్ కు ఇప్పుడు మరో షాక్ ఇచ్చేలా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. 'రాహుల్ గాంధీలో ఎక్కడో తెలియని భయం ఉంది. తరగతి గదిలో టీచర్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా రాహుల్‌ చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే ఏదైనా ఓ విషయం గురించి లోతుగా నేర్చుకోవాలనే అభిరుచి, లక్షణం, పట్టుదల లేదు' అని ఒబామా పేర్కొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

ఒబామా..తన రాజకీయ అనుభవాలు, జీవిత జ్ఞాపకాలను 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. నవంబరు 17న ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లపై కూడా ఒబామా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మన్మోహన్ సింగ్ నిజాయతీపై, ఆయన పనితీరుపై ఒబామా ప్రశంసలు కురిపించారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏం రాశారు అన్నది తెలియాల్సి ఉంది. అధ్యక్షుడి హోదాలో రెండుసార్లు 2010, 2015లో భారత్ పర్యటనకు వచ్చిన వ్యక్తిగా ఒబామా చరిత్ర సృష్టించారు.

Next Story
Share it