Telugu Gateway
Politics

అమెరికా అప్పుల తిప్పలు

అమెరికా అప్పుల తిప్పలు
X

అగ్ర రాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఆ దేశ ఖజానా ఖాళీ కావటమే. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం జూన్ నాటికి అమెరికా ఖజానాలో డబ్బులు ఖాళీ అవుతాయి. అదే జరిగితే అమెరికా డిఫాల్ట్ అవుతుంది.ఈ ముప్పును తప్పించుకోవాలి అంటే అమెరికా అప్పు పరిమితి పెంచుకోవాలి. అది అంత ఈజీగా ముందుకు సాగే ఛాన్స్ లు కనిపించటం లేదు. దీంతో అటు అమెరికా తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్ లో అయితే దేశ అప్పు పరిమితి పెంచుకోవాలంటే పార్లమెంట్ లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అదే అమెరికా లో అయితే ఈ పని అమెరికన్ కాంగ్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పు పరిమితిని పెంచాలని అధికార డెమాక్రాట్స్ చేస్తున్న ప్రతిపాదనను రిపబ్లికన్స్ ఒప్పుకోవటం లేదు. దీంతో ఇప్పుడు దీనిపై పీటముడి పడుతోంది. రిపబ్లికన్స్ చివరి వరకు ఇదే వైఖరికి కట్టుబడి ఉంటే మాత్రం అమెరికాలో ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పు పరిమితి పెంచే బదులు ఖర్చులు తగ్గించుకోవాలని రిపబ్లికన్స్ బైడెన్ సర్కారుకు సూచిస్తున్నారు. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుల పరిమితి పెంచకపోతే అమెరికా నాయకత్వ హోదా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అనే చర్చలు సాగుతున్నాయి. అమెరికా ఖజానా ఖాళీ అయితే తీవ్ర సమస్యలు వస్తాయని...చెల్లింపులు చేయలేకపోవటం వంటి సమస్యలు కూడా ముంచుకువస్తాయి. అదే జరిగితే అమెరికా ప్రతిష్ట మసకబారటం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా 70లక్షల ఉద్యోగాలు గల్లంతవుతాయని..దీంతో అత్యంత ఆందోళకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇప్పుడు అగ్రరాజ్య అమెరికా ప్రస్తుత డెట్‌ సీలింగ్‌ 31.4 ట్రిలియన్‌ డాలర్లు. కానీ, ఈ మొత్తం పరిమితి జనవరిలోనే పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆర్థికశాఖ ప్రత్యామ్నాయ చర్యల ద్వారా నిధులను సమకూర్చింది.

ఆ చాన్స్‌ కూడా అయిపోవడంతో డెట్‌ సీలింగ్‌ పెంపు తప్పనిసరైంది. ఇలాంటి సందర్భంలో మరిన్ని రుణాల ద్వారా నిధులను పొందేందుకు అమెరికా కాంగ్రెస్‌ సాధారణంగా తరచూ ఆమోదముద్ర వేస్తుంది. ఈసారి అలా జరిగేలా లేదు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండడం.. డెట్‌ సీలింగ్‌ పెంపు బిల్లుపై అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను వారు అంగీకరించకపోతుండడమే దీనికి కారణం. వాస్తవానికి బిల్లు పాస్‌కాక.. డెట్‌ సీలింగ్‌ పెంపు నిలిచిపోవడం అనేది గతంలో జరగలేదు. అప్పు పరిమితి పెంచక పోతే ఫెడరల్‌ ఉద్యోగులు, సైనిక సిబ్బంది, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోవడం, జాతీయ పార్కులు తదితర ఏజెన్సీలు మూతపడే ప్రమాదం ఉండొచ్చు. డెట్ సీలింగ్‌ పెంపు గడువు జూన్‌1. ఆ లోగా సంబంధిత బిల్లుకు ఆమోదం లభించకుంటే ప్రభుత్వ రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపు ఆలస్యమవుతుంది. క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గిపోతుంది. కొత్తగా తీసుకునే రుణాలకు అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే స్టాక్‌ మార్కెట్ల పతనం మొదలై ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని చెపుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది.

Next Story
Share it