సిద్దూను సీఎం కానివ్వను
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ సిద్ధూను సీఎంను కానివ్వబోనన్నారు. ఆయన్ను ఓడించేందుకు బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతామని ప్రకటించారు. అదే సమయంలో ఆయన హై కమాండ్‌పై కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతలైనా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు రాజకీయంగా అనుభవం లేదని, వారిని సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
మరో ఆరు నెలల పదవీ కాలం ఉండగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. ''వాళ్లు దిగిపొమ్మన్నారు, నేను దిగిపోయాను. ఒక సైనికుడిగా నా పని ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు'' అన్న అమరీందర్ మాట్లాడుతూ ''ఎమ్మెల్యేల్ని విమానాల్లో గోవాకు తీసుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాకు అలాంటివి తెలియవు. గిమ్మిక్కిలు, అడ్డదారుల్లో నేను వెళ్లను. గాంధీ వారసులకు నా విధానం ఏంటో తెలుసు. కాకపోతే రాహుల్, ప్రియాంకలకు అంతగా అనుభవం లేదు. సలహాదారులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు'' అని అన్నారు.