కేంద్ర సర్కారుకు మెదడు లేదు
వీళ్ళకు పొగరు నెత్తికెక్కింది...కూకటివేళ్ళతో పెకలించి వేస్తాం
కురచబుద్ది ఉన్న ప్రధాని మంత్రి ..కెసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కేంద్ర బడ్జెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ద్వారా ఆత్మ వంచన చేసుకున్నారని..దేశ ప్రజలను వంచించారని మండిపడ్డారు. కేంద్రంలోని ప్రస్తుత సర్కారుకు మెదడు లేదని వ్యాఖ్యానించారు. అసలు ఈ బడ్జెట్ లో ఎవరికి మేలు చేశారో అర్ధం కావటం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దేశానికి చెప్పుకోదగ్గ స్థాయిలో చేయలేదని..ఇప్పుడు బిజెపి అదే బాటలో సాగుతోందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని ఏదో ఉద్దరిస్తారు అనుకుంటే గుజరాత్ మోడల్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసి ప్రయోజనం పొందారన్నారు. బిజెపి వాళ్ళకు పొగరు కూడా నెత్తికెక్కిందని..వీళ్ళను కూకటివేళ్ళతో పెకలించి వేస్తామని హెచ్చరించారు. దేశానికి అత్యంత కురచబుద్ధి ఉన్న ప్రధాని ఉన్నారు అన్నారు. ఈ విషయంలో తాను చాలా బాధతో చెప్పాల్సి వస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం కేంద్ర బడ్జెట్ లో 12800 కోట్ల రూపాయలు కేటాయించారని..కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే 33600 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. మరి కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు లేదు..వైద్య మౌలికసదుపాయాలకు లేవు..రైతుల గురించి ప్రస్తావించలేదు..మరి ఎవరికి కేటాయించారన్నారు.
ఇది అంతా గోల్ మాల్ గోవింద అని వ్యాఖ్యానించారు. దొంగలకు...బ్యాంకు మోసాలకు పాల్పడేవారికి మాత్రమే బిజెపి ప్రభుత్వం మేలు చేస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మాటల గారడీ తప్ప ఏమీ లేదని, ఇది చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడ్డారు. సామాన్యులను నిరాశ, నిస్పృహకు గురిచేసిందన్నారు. దేశ ప్రజల్ని ఘోరంగా అవమనించారని, బడ్జెట్‌లో పేదలకు గుండుసున్న అని విమర్శించారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్‌మాల్ బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు శూన్యమని, దేశ చేనేత రంగానికి బడ్జెట్‌లో చేసిందేం లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్భిట్రేషన్ సెంటర్ పెట్టినప్పటి నుంచి మోడీకి నిద్ర పట్టడంలేదని...అసలు ఇది రాకుండా చేసే పని చేశారన్నారు. కానీ శిఖండిలా ఇప్పుడు అహ్మదాబాద్ లోని గిఫ్ట్ సిటీలో పెడుతున్నట్లు ప్రకటించారని..ఇంత కంటే సిగ్గుచేటు ఉంటుందా అని ప్రశ్నించారు.