Telugu Gateway
Politics

కేంద్ర నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టిన స్టాలిన్

కేంద్ర నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టిన స్టాలిన్
X

కేంద్రం తాజాగా ప్ర‌క‌టించిన జాతీయ మానిటైజేష‌న్ పైప్ లైన్ (ఎన్ ఎంపీ) ప్ర‌తిపాద‌న‌ను త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ త‌ప్పుప‌ట్టారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గురువారం ఆయన శాసన సభలో మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోని ఆస్తులు ఈ దేశ ప్రజల సంపద అన్నారు. ప్రజా సేవకు పని చేస్తున్న పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ ‌ను ప్రైవేటీకరించడం లేదా లీజుకు ఇవ్వడం దేశ సంక్షేమానికి మంచి సంకేతం కాదని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాస్తానని చెప్పారు. జీరో అవర్‌లో కాంగ్రెస్, సీపీఐ సభ్యులు అడిగిన ప్రశ్నకు పరిశ్రమల శాఖ మంత్రి థంగం థెన్నరసు సమాధానమిస్తూ, ప్రభుత్వ రంగంలోని ఆస్తుల ప్రైవేటీకరణ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు.

ఈ ప్రభుత్వ ఆస్తులను సృష్టించేందుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయని గుర్తు చేశారు. ఉదాహరణకు సేలం ఉక్కు కర్మాగారానికి చాలా భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం క్రింద ప్రభుత్వ ఆస్తులను నిర్వహించాలనే పథకాన్ని నీతీ ఆయోగ్ రూపొందించిందని చెప్పారు. దీనినే నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ అంటున్నారని చెప్పారు. దీని క్రింద తమిళనాడులోని కొన్ని రోడ్లు, ఊటీలోని హెరిటేజ్ ట్రైన్ సర్వీస్, తుత్తుకుడి హార్బర్‌లోని బెర్త్ ఫెసిలిటీస్ వంటివాటిని గుర్తించారని చెప్పారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సైతం మోడీ స‌ర్కారు నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు.

Next Story
Share it