కమిషన్ల మంత్రి ఇక ఇంటికే

కర్ణాటకలో గత కొన్ని రోజులుగా కమిషన్ల మంత్రి ఈశ్వరప్ప వ్యవహారం కలకలం రేపుతోంది. ఇది ఏకంగా ధేశ రాజధాని ఢిల్లీ వరకూ కూడా చేరింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావటం..ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారేలా ఉండటంతో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మయ్ కూడా మంత్రి ఈశ్వరప్ప రాజీనామా కోరినట్లు సమాచారం. దీంతో ఆయన తాను శుక్రవారం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తొలుత రాజీనామా చేసేదిలేదన్న ఆయన ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
నాలుగు కోట్ల రూపాయల పనులు చేసిన కాంట్రాక్టర్ కు 40 శాతం కమిషన్లు ఇస్తే తప్ప బిల్లు క్లియర్ చేయనని మంత్రి అనుచరులు బెదిరించటంతో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం కర్ణాటకలో పెద్ద సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఈశ్వరప్ప దిగిపోవాలంటూ విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురయ్యాయి. అదే సమయంలో ఆయన అరెస్ట్ కు కూడా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంట్రాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి నమోదు అయిన ఎఫ్ ఐఆర్ లో మంత్రి పేరు కూడా ఉంది.