ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ...రాజమౌళి మ్యాజిక్ మిస్!

ఇప్పటి వరకూ ఫెయిల్యూర్ లేని దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు అగ్రహీరోలు. సహజంగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. దీనికి రాజమౌళి చేసే ప్రచారం అదనం. వాయిదాల మీద వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రతిష్టాత్మక సినిమాగా ప్రచారం పొందిన ఆర్ఆర్ఆర్ శుక్రవారం నాడు విడుదలైంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు యువకులుగా ఉన్న సమయంలో ఇద్దరూ స్నేహితులుగా ఉంటే ఎలా ఉండే వారు అన్న కల్పిత కథను తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి సినిమా ప్రారంభం సమయంలోనే చెప్పారు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రారంభం నుంచి కొమరం భీమ్ గెటప్ లోనే కన్పిస్తాడు. కానీ రామ్ చరణ్ మాత్రం క్లైమాక్స్ లోనే అల్లూరి సీతారామరాజు గెటప్ లో దర్శనం ఇస్తాడు. సినిమా అసలు కథ విషయానికి వస్తే గిరిజనుల అమ్మాయిని బ్రిటీష్ పాలకుడు అయిన స్కాట్ భార్య బలవంతంగా తన ప్యాలెస్ కు తీసుకెళుతుంది. ఆమెను విడిపించటానికి గోండు బిడ్డ భీమ్ ( ఎన్టీఆర్) ప్రయత్నాలు చేస్తాడు. దీని కోసం అడవి నుంచి ఈ బంగ్లా ఉండే ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేసి, పేరు మార్చుకుని ఉంటాడు. అదే సమయంలో ఓ రైలు ప్రమాదం జరిగిన సమయంలో నదిలో చిక్కుకు పోయిన బాలుడిని కాపాడే క్రమంలో భీమ్, రామరాజు(రామ్ చరణ్) స్నేహితులుగా మారతారు.
గిరిజనుల అమ్మాయిని కాపాడుకునే క్రమంలో స్నేహితుడు రామ్ సాయంతో జెన్నీ (ఒలివియో మోరిస్) స్నేహం చేస్తాడు భీమ్. కానీ రామరాజు బ్రిటీషర్ల దగ్గర పనిచేసే పోలీసు అధికారి భీమ్ కు తెలియదు. రామ్ పదోన్నతి కోసం బ్రిటీషర్లు టాస్క్ లు పూర్తి చేస్తుంటాడు. చివరకు స్కాట్ ఆదేశాల భీమ్ ను అరెస్ట్ చేస్తాడు రామ్. ఎంతో నమ్మిన స్నేహితుడు అయిన భీమ్ ను రామ్ ఎందుకు అరెస్ట్ చేస్తాడు. రామ్ ఎందుకు పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తాడు అన్నదే సినిమా కథ అంతా. ఈ సినిమాలో రామ్ చరణ్ ను నిప్పుగా, ఎన్టీఆర్ ను నీరు గా చూపించాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలో హైలెట్ ఏదైనా ఉంది అంటే విరామ సమయంలో గిరిజన బాలికను కాపాడేందుకు ఎన్టీఆర్ బ్రిటీషర్ల ఫ్యాలెస్ లోకి ఎంట్రీ ఇచ్చే సన్నివేశం సినిమాలో ఊపు తెచ్చిన ఘటనగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో రామ్ చరణ్ ను పోలీసు అధికారిగా పరిచయం చేసే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. శిక్ష అనుభవించటానికి ముందు భీమ్ గా నటించిన ఎన్టీఆర్ కొమరం భీముడో పాట ఆకట్టుకుంది.
నటనపరంగా చూస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ పాత్రలను పూర్తిగా న్యాయం చేశారు. అయితే కథలో దమ్ములేకపోవటంతో ప్రేక్షకులు పెద్దగా సినిమాకు కనెక్ట్ కారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకు పర్పెక్ట్ గా సెట్ కాగా..రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కంటే బ్రిటీషర్ల దగ్గర పోలీసు అధికారి పాత్రలోనే మంచి నటన కనపర్చాడు. బ్రిటీషర్ల చేతిలో చావుదెబ్బలు తిన్న తర్వాత కూడా రామరాజ్ జైలులో ఎక్సర్ సైజ్ లు చేస్తూ కన్పించే సన్నివేశాలు చూసి థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుకుంటారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అలియా భట్ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ధీటుగా స్కాట్ గా నటించిన రే స్టీవెన్ సన్ ఆకట్టుకున్నాడు. నిజంగా వీరిద్దరి తర్వాత ఎక్కువ మార్కులు పడేది అతని పాత్రకే. అజయ్ దేవవన్, శ్రియ, సముద్రఖనిలో పాత్రలో రొటీన్ గానే సాగిపోయేవి. ఓవరాల్ గా చూస్తే ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ కూడా సినిమా సో సోగానే సాగుతుంది. సెకండాప్ లో అయితే సినిమా మరింత నీరశిస్తుంది. అక్కడక్కడ యాక్షన్ సీన్స్ బాగున్నా అవన్నీ కూడా ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ లో చూపించటంతో సినిమాలో కొత్తగా ఏమీ లేదనే భావనతో ప్రేక్షకులు ఉంటారు. ఆర్ఆర్ఆర్ తో పోలిస్తే బాహుబలి సినిమానే చాలా బెటర్ అనే అభిప్రాయం కలగక మానదు. ఆర్ఆర్ఆర్ లో మాత్రం రాజమౌళి మ్యాజిక్ మిస్ అయిందనే చెప్పొచ్చు.
రేటింగ్. 3.25-5