'ఒకే ఒక జీవితం' మూవీ రివ్యూ
శర్వానంద్ నటించిన మహాసముద్రం, ఆడవాళ్లూ మీకు జోహర్లు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇటీవల శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే 'ఒకే ఒక జీవితం' సినిమాతో కొత్త కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ. హీరో శర్వానంద్ కు ప్రజల మద్యకు వస్తే టెన్షన్. గిటారిస్ట్. ఇంట్లో మాత్రం తన సత్తా చాటుతాడు. బయటకు వచ్చి మాత్రం ప్రదర్శన చేయాలంటే వణుకు. ముందు తల్లి..తర్వాత ప్రియురాలు ఈ లోపం నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఫలితం ఉండదు. హీరో సంగీతం చుట్టూ తిరుగుతుంటే..ఆయన ఒక స్నేహితుడైన వెన్నెల కిషోర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తుంటాడు. ఎవరైనా తనను బ్రోకర్ అని పిలుస్తారు తప్ప..ఎవరూ పేరు పెట్టి పిలవరు. ఒక్కసారి మాత్రం మిస్టర్ శ్రీను అని ఫోన్ లో పిలిస్తే ఇక వెన్నెల కిషోర్ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. మరో స్నేహితుడు ప్రియదర్శి పెళ్లి కోసం తపిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్లు సంబందాల మీద సంబంధాలు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తగా ఉన్న నాజర్ కు నగర శివార్లలో వెన్నెల కిషోర్ ఓ ఇంటిని చూపిస్తారు. కొత్త ఇంట్లోకి వచ్చిన నాజర్ సామాన్లలోని అట్టపెట్టపై ఉన్న ఓ తేదీని చూసి శర్వానంద్ టెన్షన్ కు గురవుతాడు. ఇది గమనించిన నాజర్..ఈ తేదీకి నీకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని కోరతాడు. అది తన తల్లి పుట్టిన రోజు అని..కారు ప్రమాదంలో తన తల్లి చనిపోయిందని చెబుతాడు. అప్పుడే నాజర్ వాళ్లకు ఒక టాస్క్ అప్పగిస్తాడు.
తన మాట వింటే తాను కనిపెట్టిన టైమ్ మెషిన్ లో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లి తల్లిని ఆ ప్రమాదం నుంచి కాపాడుకునే అవకాశం ఇస్తానని..అదే సమయంలో ఈ మెషిన్ కనుగోనటంలో తనతోపాటు పనిచేసిన శాస్త్రవేత్తను కూడా కాపాడాలని కోరతాడు. నాజర్ చెప్పినట్లే వీళ్లు టైమ్ మెషిన్ లో ఇరవై ఏళ్లు వెనక్కి పోతారు. వెళ్లి వాళ్లను వాళ్లను వాళ్లే కలుసుకుంటారు. అసలు తమపై ఇంత ఫోకస్ పెడుతున్న వీళ్లు ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేసిన ఆ ముగ్గురు పిల్లలు వీరు ఉంటున్న ఇంట్లోని టైమ్ మెషిన్ ద్వారా ఇరవై సంవత్సరాలు ముందుకెళతారు. దీంతో సినిమా రసకందాయంలో పడుతుంది. టైమ్ మెషిన్ కాన్సెప్ట్ లో గతంలో ఎవరూ టచ్ చేయని కోణాన్ని తీసుకున్న దర్శకుడు శ్రీకార్తిక్ మంచి ప్రయత్నం చేశాడు. టైమ్ మెషిన్ కాన్సెప్ట్ కు అమ్మ సెంటిమెంట్ ను జోడించటం..వెన్నెల కిషోర్, ప్రియదర్శిలతో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. సినిమా అంతా సైన్స్ చుట్టూ తిప్పినా కూడా విధిని ఎవరూ తప్పించలేరు అన్న సందేశాన్ని ఇచ్చాడు. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రలకు సంబంధించి చిన్న పిల్లల పాత్రలు పోషించిన వారు సినిమాలో హైలెట్ గా నిలుస్తారు. ఎప్పుడూ సరదా సరదా సన్నివేశాల్లో చలాకీగా కన్పించే శర్వానంద్ ఈ సినిమాలో తన నటనలోని డెప్త్ చూపించారు. వెన్నెల కిషోర్ కు కూడా కొత్తతరహా పాత్రే అని చెప్పొచ్చు. సినిమా లైన్..నటీనటుల పాత్రలు బాగున్నా సినిమాలో వేగం తగ్గటం పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది. తెలుగు సినిమాలో ఉండే సహజమైన హీరోయిజం ఎలివేషన్లు ఎక్కడా కన్పించవు. నీట్ గా..కథకు అవసరమైన మేరకే నడిపించారు. కీలక పాత్రలో నటించిన అమల ఎందుకో బాగా తేలిపోయినట్లు కన్పిస్తారు.అయితే కమర్షియల్ గా ఎంత మేరకు విజయం సాధిస్తుందో వేచిచూడాల్సిందే.
రేటింగ్. 2.5-5