Telugu Gateway
Movie reviews

ఆదిపురుష్ మూవీ రివ్యూ

ఆదిపురుష్ మూవీ రివ్యూ
X

పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా ఆదిపురుష్ పై అంచనాలు పెంచటంలో చిత్ర యూనిట్ విజయవంతం అయిందనే చెప్పాలి. సినిమా ప్రమోషన్ లో భక్తిని కూడా జోడించి, ప్రతి థియేటర్ లో హనుమంతుడికి ఒక సీట్ అంటూ ప్రచారం చేసి ప్రయోజనం పొందే ప్లాన్ వేశారు. మరో వైపు ప్రభాస్ ఫాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభాస్ కు చెందిన రెండు సినిమాలు సాహో, రాధే శ్యామ్ లు వరసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రాముడు...కృషుడు వంటి కథలతో స్టోరీ మంచిగా చెపితే సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇందుకు ఉదాహరణ చిన్న సినిమా అయినా నిఖిల్ నటించిన కార్తికేయ 2 విజయాన్ని చెప్పుకోవచ్చు. మరి ప్రభాస్ రేంజ్ హీరో ...అది కూడా రాముడి పాత్ర పోషించారు అంటే అంచనాలు ఎలా ఉంటాయి ఊహించుకోవచ్చు. అందరు దర్శకులు తరహాలోనే దర్శకుడు ఓం రౌత్ కూడా ఆదిపురుష్ సినిమా కోసం వాల్మీకి రామాయణం మూలకథ నుంచి కీలక భాగాలు తీసుకుని మిగిలిన విషయంలో తన స్వేచ్ఛను ఉపయోగించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దర్శకుడు కథ కంటే గ్రాఫిక్స్ ను ఎక్కువ నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. రాముడి కథ అంటే భారతీయ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియటం పక్కా. మరి తెలిసిన కథను ఆకట్టుకునేలా...ప్రేక్షకులను ఆకర్షించేలా సినిమా తీయటం అంటే పెద్ద సవాల్ వంటిదే. అయితే ఈ సవాల్ ను అధిగమించటంలో దర్శకుడు ఓం రౌత్ విజయవంతమ్ కాలేదు అనే చెప్పాలి.

ఆదిపురుష్ సినిమా లో హై లైట్ ఏదైనా ఉంది అంటే అది రావణుడి లంక ను చూపించిన విధానం. లంకను వెండి తెరపై ఓం రౌత్ అద్భుతంగా చూపించారు. మరో వైపు పాత్రలో బలం కారణంగా హీరో ప్రభాస్ కంటే రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ పాత్రకే ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది. రాముడి పాత్రలో చూడటానికి ప్రభాస్ బాగానే ఉన్నా..బలమైన నటనకు స్కోప్ కనిపించలేదు. సీత గా కనిపించిన హీరోయిన్ కృతి సనన్ పాత్ర చాలా పరిమితంగా ఉంది. అందులో కూడా ఎలాంటి బలం లేదు. హనుమంతుడి పాత్ర పోషించిన దేవ్ దత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆదిపురుష్ టీజర్ సమయంలోనే ఇది ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమా నా..లేక గ్రాఫిక్స్ తో తీస్తున్న సినిమా నా అన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా అంతా ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ డామినేట్ చేశాయని చెప్పాలి. త్రీ డీ లో చూస్తే కొన్నిసార్లు ప్రేక్షకులు భయపడతారు కూడా. ఆదిపురుష్ సినిమా పిల్లలకు బాగా నచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లో గతంలో వచ్చిన రామాయణం కథ ఆధారిత సినిమాలతో పోలిస్తే ఆదిపురుష్ నిలబడదు అనే చెప్పాలి. అయితే దర్శకుడు ఓం రౌత్ ప్రెజంట్ జనరేషన్ కు అనుగుణంగా కథను తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ ఆదిపురుషుడు అందరికీ నచ్చటం కష్టమే.

రేటింగ్: 2 .75 -5

Next Story
Share it