'ఆచార్య' మూవీ రివ్యూ
ఇది పరీక్షల సీజన్. ఈ సమయంలో వచ్చిన సినిమా పేరు ఆచార్య. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ పరీక్ష రాశాను..పలితం కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. సహజంగా పిల్లల మీద వారి వారి తల్లిదండ్రులకు ఓ అంచనాలు ఉంటాయి. వాళ్ళు ఎలా చదువుతారో తెలుసు కాబట్టి... మార్కులు కూడా ఏ రేంజ్ లో వస్తాయో కూడా అంచనా వేస్తారు. అలాగే దర్శకుడు కొరటాల శివ గత సినిమాలు...ఆచార్యలో ఇద్దరు మెగా హీరోలు ఉన్నారంటే సినిమా ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. కానీ అందరి అంచనాలు తలకిందలు అయ్యాయనే చెప్పాలి. ఈ సినిమా విషయానికి వస్తే టీచర్ (కొరటాల శివ) తోపాటు..విద్యార్ధులు(చిరంజీవి, రామ్ చరణ్ లు) కూడా అత్తెసరు మార్కులతోనే ఏదో బయటపడ్డారు అంటే బయటపడ్డారు . సినిమా చూసిన వారంతా ఆచార్య..ఇలా చేశారేమిటి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కొరటాల శివ ఓ సామాజిక సందేశం ఉన్న ఓ కాన్సెప్ట్ ను ఎంచుకుని వాటికి కమర్షియల్ హంగులతో ఆకట్టుకునేలా సినిమాలు తీయటంలో ఆయన ఇప్పటివరకూ విజయం సాధిస్తూ వచ్చారు. కానీ ఆచార్య విషయంలో కొరటాల శివ విజయాలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. స్టోరీ లైన్ విషయానికి వస్తే పాదఘట్టం..ధర్మస్థలి. రెండు గ్రామాలు. అక్కడ ఉన్న యురేనియం నిల్వల కోసం ఓ మైనింగ్ కంపెనీ ప్రయత్నాలు..అందుకు అడ్డుతగిలే పాత్రల్లో కామ్రెడ్ ఆచార్య, సిద్ధ. ఎలాగైనా ఈ గనులు దక్కించుకోవాలని కంపెనీ ప్రయత్నం..అడ్డుకునేందుకు ఆచార్య, సిద్ధలు చేసే ప్రయత్నాలే సినిమా అంతా.
చిరంజీవి, రామ్ చరణ్ లు ఇద్దరూ ఇందులో మావోయిస్టులుగా కన్పించినా...ఎక్కడో ఆ ఫీల్..ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా పాత్రలు లేవనే చెప్పాలి. ఇదే తరహా మైనింగ్ కథలతో ఇప్పటికే ఓ అరడజనుపైగా సినిమాలు వచ్చి ఉంటాయి తెలుగులో. ఆచార్య సినిమాలో బాగున్నది ఏమైనా ఉన్నాయా అంటే అవి పాటలు..చిరంజీవి, రామ్ చరణ్ డ్యాన్స్ లు. అయితే ఇప్పటికే పాటలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినందున ప్రేక్షకులకు సినిమాలో కొత్తదనం కరువైందనే చెప్పాలి. అసలు పూజా హెగ్డె పాత్ర ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. దర్శకుడు కొరటాల శివ ఫస్టాఫ్ అంతా చిరంజీవితో నడిపించి..సెకండాఫ్ లో రామ్ చరణ్ సిద్ధ పాత్రకు ఎంట్రీ ఇచ్చారు. ప్రధాన విలన్ గా నటించిన సోనూసూద్ పాత్రలో కూడా ఏ మాత్రం బలం లేదు. సినిమాలో అక్కడక్కడ యాక్షన్ సీన్స్ బాగున్నా..ఓవరాల్ గా చూస్తే ఆచార్య మూవీ అత్యంత సాదాసీదా మూవీగానే మిగిలిపోతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్న రామ్ చరణ్ కు ఇది ఏ మాత్రం మైనస్ గానే మారుతుంది.
రేటింగ్. 2.5-5