Telugu Gateway
Andhra Pradesh

సంచలనం...సీజెఐకి సీఎం జగన్ లేఖ

సంచలనం...సీజెఐకి సీఎం జగన్ లేఖ
X

మీడియాకు విడుదల

సుప్రీం జడ్జీ రమణపై తీవ్ర ఆరోపణలు

చంద్రబాబుతో కలసి కోర్టులను ప్రభావితం చేస్తున్నారు

ఏపీ హైకోర్టు సీజెని ప్రభావితం చేస్తున్నారు

దేశ చరిత్రలోనే తొలిసారి. ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు జడ్జీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర జడ్జీలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం. ఆ లేఖను మీడియాకు విడుదల చేయటం. సహజంగా న్యాయమూర్తులపై సీఎంలకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే లేఖలు రాస్తారు. అవి చాలా రహస్యంగా సాగిపోతాయి. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. ఇందులో మరో విశేషం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని అక్టోబర్ 6న కలిశారు. అదే తేదీతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డేకు సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం విశేషం. ఈ రెండు తేదీలు మ్యాచ్ కావటం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ లేఖతోపాటు జడ్జీలకు సంబంధించిన పలు అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం మీడియాకు వెల్లడించారు. 'ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని ఛానళ్లలో వస్తున్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నామన్నారు.

అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి జస్టిస్‌ సోమయాజులు ఇచ్చిన స్టే ఇచ్చారని తెలిపారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ కేసులో రాష్ట్ర హైకోర్టు ఏకంగా గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చిందన్నారు. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్‌వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ ఏ బాబ్డేకు ఫిర్యాదు చేశాం. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్‌ 8న లేఖ అందించినట్లు తెలిపారు.నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో అధికార వికేంద్రీకరణ బిల్లులను..ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఆ వెంటనే ఏకంగా ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరీని సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ జోక్యం తర్వాత హైకోర్టులో పరిణామాలు మారిపోయాయి. చంద్రబాబు కోరుకున్నట్టుగా కొన్ని ముఖ్యమైన కేసులన్నీ జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ రమేష్‌ బెంచ్‌కు మారిపోయాయని పేర్కొన్నారు. సీఎం జగన్ సీజెఐకి రాసిన లేఖలో అమరావతిలో సుప్రీంకోర్టు జడ్జి రమణ కుమార్తెలు కొనుగోలు చేసిన భూముల వ్యవహారాల గురించి కూడా ప్రస్తావించారు. జస్టిస్ రమణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మధ్య సంబంధాల గురించి గతంలో రిటైర్డ్ జస్టిస్ చలమేశ్వర్ బహిర్గతం చేసిన అంశాల గురించి కూడా జగన్ ప్రస్తావించారు. ఈ వ్యవహారం దేశ రాజకీయాలు, జ్యుడిషియరీలో పెద్ద కుదుపుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it