Telugu Gateway
Health Tips

నిన్న ఎన్టీఆర్ పేరు...వెంటనే లోకేష్ కు పగ్గాల డిమాండ్

నిన్న ఎన్టీఆర్ పేరు...వెంటనే లోకేష్ కు పగ్గాల డిమాండ్
X

వెంటనే స్పందించిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి కుప్పం పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత చంద్రబాబు వెంటనే కుప్పం పర్యటన తలపెట్టారు. ఈ తరుణంలో శుక్రవారం నాడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా..కొంత మంది కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ను బరిలోకి దింపాలని..ఆయన పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై చంద్రబాబు ఏమీ స్పందించకుండా మౌనంగా విని ఊరుకున్నారు. ఆ మరుసటి రోజే అంటే శనివారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజుపేటలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో పార్టీ కార్యకర్త ఒకరు 'లోకేశ్‌ను కుప్పానికి పంపించండి. లోకేశ్‌కు పగ్గాలివ్వండి' అని కేకలు వేశాడు. 'లోకేశ్‌కు పగ్గాలిస్తే నాయకులందరూ భయపడి పని చేస్తారు. కార్యకర్తలకు కూడా ధైర్యమొస్తుంది. పరిస్థితులు చక్కబడతాయి. విజయం మన వశమవుతుంది' అని వ్యాఖ్యానించాడు.

దీనిపై చంద్రబాబు స్పందించారు. 'నేను వెళ్లాక లోకేశ్‌ వస్తాడు. ఇద్దరం తరచూ వస్తాం. రాబోయే ఎన్నికలన్నిటిలో విజయం మనదే. అధైర్యపడొద్దు. అంతా సర్దుకుంటుంది' అని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలన్న డిమాండ్ పై మౌనం వహించిన చంద్రబాబు...లోకేష్ విషయంలో మాత్రం వెంటనే స్పందించారు. తాను వెళ్ళిన తర్వాత లోకేష్ కుప్పానికి వస్తారని తెలపటం ద్వారా చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పేశారు. పార్టీలో లోకేష్ నాయకత్వానికి ఏ మాత్రం ఆమోదం లభించటం లేదనే వాదన ఉన్న సమయంలో ఏకంగా 'లోకేష్ కు పగ్గాలు..నాయకులు అంతా భయపడి పనిచేస్తారు' వంటి వ్యాఖ్యలు చేయటం వెనక ప్లాన్ ఉందనే అభిప్రాయం కూడా కొంత మంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలనే డిమాండ్ కు కౌంటర్ గానే ఇది వచ్చిందనే వాదనా ఉంది.

Next Story
Share it