Telugu Gateway
Cinema

తెలంగాణాలో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణాలో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్
X

సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. థియేటర్లతో పాటు మల్టీఫ్లెక్స్ లు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, తత్సమాన ప్రదేశాలు ఓపెన్ చేయటానికి అనుమతించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం 50 శాతం సామర్ధ్యంతోనే థియేటర్లు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ప్రేక్షకులతోపాటు సిబ్బంది, థియేటర్లలో తినుబండారాలు అమ్మే వారితో సహా అందరూ విధిగా మాస్క్ లు ధరించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి షో తర్వాత ముఖ్యంగా కామన్ ఏరియాల్లో శానిటైజేషన్ చేయాలన్నారు. థియేటర్లలో ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉండేలా చూడాలన్నారు.

గాలి రీ సర్కులేట్ కాకుండా...ఎప్పటికప్పుడు ఫ్రెష్ గాలి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా ప్రదర్శనల మధ్య కూడా గ్యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజా ఉత్తర్వులతో సత్వరమే థియేటర్లను ప్రారంభించటానికి వెసులుబాటు లభించింది. అయితే ఇప్పటికిప్పుడు థియేటర్లలో ప్రదర్శించేందుకు రెడీగా ఉన్న సినిమాలు ఎన్ని?. సినిమా హాళ్లు తెరిచినా ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసే సాహసం చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే సినిమా పరిశ్రమకు పలు రాయితీలు ప్రకటిస్తూ సీఎం కెసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా కృతజ్ణతలు తెలిపారు. టిక్కెట్ ధరలను సవరించుకునే వెసులుబాటు ఇవ్వటం వంటి కీలక నిర్ణయాలు పరిశ్రమకు మేలు చేస్తాయని తెలిపారు.

Next Story
Share it