Telugu Gateway
Cinema

స్టార్స్ దగ్గరికి సూపర్ స్టార్ కృష్ణ

స్టార్స్ దగ్గరికి సూపర్ స్టార్ కృష్ణ
X

టాలీవుడ్ లో ఒక తరం పూర్తిగా ముగిసిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణం రాజు, ఇప్పుడు కృష్ణ, తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో నూతన ఆవిష్కరణలకు కారణం అయిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అయన వయస్సు 79 సంవత్సరాలు. గుండె పోటు తో ఆస్పత్రిలో చేరిన అయనకు వైద్యులు చికిత్స అందించినా ఉపయోగం లేకుండా అయింది. తెలుగు సినిమా పరిశ్రమలో తొలి సూపర్ స్టార్ బిరుదు అందుకున్న హీరో కృష్ణ మాత్రమే. సినీ ప్రేమికుల్లో కృష్ణ కు అభిమానులు చాలా ఎక్కువ. అయన నటనను విమర్శించే వారు ఉన్నా అంతకు ఎన్నో రేట్లు అభిమానులు కృష్ణ సొంతం. పాత తరం హీరోల్లో ఉన్న ఒక్క వ్యక్తి కూడా తనువూ చాలించారు. హీరో కృష్ణ వారసుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లోకి ప్రవేశించి సూపర్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ఇటీవలే తల్లిని కోల్పోయిన మహేష్ బాబు ఇప్పుడు తండ్రిని కోల్పోయారు. గత ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్‌కు గురైన కృష్ణను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం ఆయనను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్సను అందించిన వైద్యులు.. కృష్ణ పరిస్థితి సీరియస్‌గానే ఉందని తెలిపారు.

వాళ్లు అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే కృష్ణ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మంగళవారం ఉదయం 4 గంటలకు ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ మధ్య కాలంలో వరుసగా.. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముగ్గురు కుటుంబ సభ్యులు విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు , ఆ తర్వాత మొదటి భార్య ఇందిరా దేవి మృతి తో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ పరిణామాలు కృష్ణను మానసికంగా కృంగదీయడంతో.. ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై కూడా పడిందని చెపుతున్నారు. 350కి పైగా చిత్రాలతో తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఘట్టమనేని కృష్ణ.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య , నాగరత్నమ్మ దంపతులకు 31మే, 1943న తొలి సంతానంగా జన్మించారు. హనుమంతరావు, నిర్మాత ఆదిశేషగిరిరావులు కృష్ణ సోదరులు. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు 5 గురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. కృష్ణ మరణ వార్తతో టాలీవుడ్ ద్రిగ్భ్రాంతికి గురి అయింది.

Next Story
Share it