Telugu Gateway
Cinema

అంచనాలు అందుకొని స్పై... సైలెంట్ హిట్ కొట్టిన విష్ణు

అంచనాలు అందుకొని స్పై... సైలెంట్ హిట్ కొట్టిన విష్ణు
X

ఒకే వారం రెండు సినిమాలు విడుదల కావటం టాలీవుడ్ లో సాధారణ విషయమే. మరీ పెద్ద హీరోల సినిమాలు ఉన్నప్పుడు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతి వంటి పండగల సమయంలో అయితే పెద్ద హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గురువారం నాడు కూడా బక్రీద్ సెలవు కావటంతో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన స్పై మూవీ. రెండవది శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన. స్పై సినిమా విషయానికి వస్తే ఇందులో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కథను కూడా చూపించబోతున్నారు అని ప్రచారం జరగటంతో దీనిపై అంచనాలు పెరిగాయి. సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ సినిమా కోసం సుభాష్ చంద్ర బోస్ పేరు వాడుకుంది తప్ప ఇందులో అయన గురించి కొత్తగా చెప్పింది ఏమీ లేదు అనే చెప్పాలి. ఇతర జాతీయ నేతలు అయిన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు లాంటి వాళ్ళ లాగా బోస్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఓవర్ అల్ గా చూస్తే నిఖిల్ పాన్ ఇండియా జోష్ కు ఈ సినిమా బ్రేక్ వేసింది అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఉన్న సన్నివేశాలు ఇప్పటికే చాలా సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు చూసి ఉన్నవే. దీంతో భారీ అంచనాలతో విడుదల అయిన స్పై మూవీ సాదాసీదా సినిమాగా మిగిలిపోయింది.

ఇక ఏ మాత్రం అంచనాలు లేకుండా సాఫ్ట్ టైటిల్ సామజవరగమన పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు మాత్రం థియేటర్ల నిండా నవ్వులు పూయిస్తున్నాడు. సింపుల్ కథతో సామజవరగమన సినిమా తో శ్రీ విష్ణు హిట్ టాక్ తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరో కు సామజవరగమన మంచి బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి. మాములుగా కొడుకు , కూతుర్ల చదువు కోసం తల్లి, తండ్రులు తంటాలు పడుతుంటారు.కానీ సామజవరగమన సినిమాలో మాత్రం అంతా రివర్స్. తండ్రిని డిగ్రీ పాస్ చేయించేందుకు కొడుకు పడే తిప్పలు, ఒక సారి లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఏ అమ్మాయి అయినా మళ్ళీ లవ్ అంటూ తన ముందుకు వస్తే హీరో శ్రీ విష్ణు వాళ్ళతో రాఖి కట్టించుకునే సన్నివేశాలు ఇలా సినిమా అంతా సరదా సరదాగా ముందుకు సాగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రేబ మోనికా జాన్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో అయితే శ్రీ విష్ణు అమ్మాయిల గురించి గుక్కతిప్పుకోకుండా చెప్పే డైలాగు సినిమా లో హై లైట్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ బాలు పాత్రలో శ్రీ విష్ణు తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక వెరైటీ పాత్రతో ఆకట్టుకున్నాడు. ఓవర్ ఆల్ గా చూస్తే ఈ వారం విజేత ఖచ్చితంగా శ్రీవిష్ణు అనే చెప్పాలి. క్లీన్ కామెడీ, ఫామిలీ ఎంటర్ టైనర్ గా..సామజవరగమన నిలిస్తే . స్పై మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది అనే చెప్పాలి.

Next Story
Share it