తెలంగాణలో ఆర్ఆర్ఆర్ టిక్కెట్ ధర ఎంత అంటే?!
తెలంగాణలో సినిమా టిక్కెట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ఏపీలో ఒక సమస్య అయితే..తెలంగాణలో మరో సమస్యగా మారింది. అనుమతి ఇచ్చారు కదా అని తెలంగాణాలో దోపిడీకి తెరతీశారు. దీనిపై శుక్రవారం నాడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. సినిమా టిక్కెట్ రే్ట్లకు సంబంధించి స్క్రీన్ షాట్లను కూడా పెట్టి మరీ దుమ్మెత్తిపోశారు. ఇక్కడ ఓ ఉదాహరణ చెప్పుకోవాలి. శుక్రవారం నాడు అర్జున ఫాల్లుణా సినిమా విడుదల అయింది. ఈ సినిమా టిక్కెట్ ధర హైదరాబాద్ లోని ఐమ్యాక్స్ లో అయితే పన్నులతో కలుపుకుని 329 రూపాయలు అయింది. దీంతో సినీ అభిమానులు మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ఆసరా చేసుకుని చిన్న సినిమాలు కూడా భారీ బడ్జెట్ రేంజ్ సినిమాల తరహాలో రేట్లు నిర్ణయించారు. దీంతో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం..పరిశ్రమపై మండిపడ్డారు. దీంతో ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ విలేఖరుల సమావేశంలో పలు అంశాలపై స్పందించారు.
`చిన్న సినిమాలు 50 -150 రూపాయల వరకూ టికేట్ రేటుకి అమ్ముకోవచ్చు. నిర్మాతలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం అధిక దరలకు టికెట్లు విక్రయించకూడదు. ఈ రోజు కొన్ని థియేటర్స్‌లో టికెట్ రేట్లు ఎక్కువ రేటుకి అమ్మడం మా దృష్టికి వచ్చింది. మేం వెంటనే స్పందించి ఆ రేట్లను సవరించి మిగతా డబ్బుని వారి ఎకౌంట్స్‌కి రీఫండ్ చేయడం జరిగింది. మాకు ప్రేక్షకుల సౌకర్యాలే ముఖ్యం. ప్రస్తుతం నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఈ విధానం గురించి అవగాహన కలిపిస్తున్నాం. మీడియా సహకారంతో ఈ జీవోపై మరింత మందికి అవగాహన వస్తుందని నమ్ముతున్నాం. కొన్ని థియేటర్స్ క్యాంటిన్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని కూడా సవరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం` అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కు సింగిల్ స్క్రీన్ లో అయితే 175 రూపాయలు, మల్టీప్లెక్స్ లో అయితే 295 రూపాయలు ఉంటుందని తెలిపారు. అయితే మల్టీప్లెక్స్ ల్లో పన్నులతో కలుపుకుంటే ఒక్కో టిక్కెట్ ధర 329 రూపాయలకు చేరుతుంది.