రేణు దేశాయ్ పై దారుణమైన ట్రోలింగ్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా వివాదాలతో అయన మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి బ్రో సినిమా కు ఆమెకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఆ సినిమాలోని ఒక డాన్స్ బిట్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది అనే చెప్పాలి. ఆ డాన్స్ బిట్ ఒకప్పుడు మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్ ని పోలి ఉండటంతో మంత్రి అంబటి రాంబాబుతో పాటు అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై ఎటాక్ చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొలేకే సినిమాల్లో ఇలాంటివి పెట్టి పవన్ కళ్యాణ్ తృప్తి పొందుతున్నాడు అంటూ అంబటి మండిపడ్డారు. ఆ తర్వాత తాము కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం...అయన పిల్లలపై వెబ్ సిరీస్ లు..సినిమాలు తీస్తామంటూ ప్రకటించారు వైసీపీ నేతలు. ఆ సమయంలోనే రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేశారు. దీంతోనే ఆమె మరో సారి సోషల్ మీడియా లో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విమర్శలపై ఆమె మరో సారి స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ లో తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ తన జీవితం అంతా పవన్ కళ్యాణ్ అనుకూల వ్యక్తులు...పవన్ కళ్యాణ్ వ్యతిరేకులతో తిట్లు తినడానికే ఉన్నట్లు ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత ఆమె గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ తనను మోసం చేశాడు అని సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.
దీంతో అప్పటిలో పవన్ ఫాన్స్ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె బ్రో తో తలెత్తిన రాజకీయ వివాదంపై స్పందిస్తూ రాజకీయాలు ఏమైనా ఉంటే ..మీరు చూసుకోండి అంతే కానీ ఇందులోకి పిల్లలను తీసుకురావద్దకు అని...తన పిల్లలే కాకుండా ఎవరి పిల్లలను కూడా రాజకీయా వివాదాల్లోకి లాగటం సరికాదు అన్నారు. ఎందుకంటే రాజకీయాలతో వాళ్లకు సంబంధం లేదు అన్నారు. అదే సమయంలో రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని ఆయనకే తన సపోర్ట్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కూడా కాదు అని..ప్రజలకు సేవ చేయటం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని పేర్కొంది. దీనిపై మంత్రి అంబటి రాంబాబు దగ్గరి నుంచి వైసీపీ ఫాన్స్ అంతా కూడా రేణు దేశాయ్ పై ఎటాక్ కు దిగారు. అప్పట్లో ‘మోసం’ గురించి ‘నిజం’ చెబితే పవన్ కళ్యాణ్ అభిమానులు బూతులు తిట్టారంటూ రేణు దేశాయ్ వాపోయింది. ఇప్పుడేమో, పవన్ కళ్యాణ్ మంచితనం గురించి చెబుతోంటే.. పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించేవారు బూతులు తిడుతున్నారంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సార్లు కూడా డబ్బులు తీసుకు మాట్లాడినట్లు కూడా కొంత మంది ఆరోపిస్తున్నారు అని తెలిపారు.