వైఎస్ కొడుకు అవ్వకపోతే జగన్ కు అన్ని ఓట్లు వచ్చేవా?
ఓటర్లు మాకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నచ్చలేదంటే వెళ్లిపోతారా?
జగన్ లాగే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లు బ్రాండ్లు.
జగన్, పేర్నినాని, అనిల్ యాదవ్ లు కలసి రాజమౌళి కంటే గొప్ప సినిమా తీసి ఫ్రీగా చూపించండి
ఏపీ సర్కారుపై వర్మ మాటల యుద్ధం
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఎటాక్ చేస్తున్నారు. సినిమా టిక్కెట్లు, హీరోల రెమ్యునరేషన్స్ కు సంబంధించి మంత్రులు చేసిన పలు అంశాలపై ఆయన సూటి ప్రశ్నలు సంధిస్తూ సర్కారు ను మరింత ఇరకాటంలోకి పెడుతున్నారు. ఈ మేరకు ఆయన పలు అంశాలతో తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలను పలు ఛానళ్లు బిట్స్ బిట్స్ గా చేసి వైరల్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేయని వర్మ ఈ సారి డైరక్ట్ ఎటాక్ ప్రారంభించారు. వర్మ చేసిన వ్యాఖ్యలు లాజికల్ గా ఉండటంతో వీటికి విశేష ఆదరణ కూడా దక్కుతోంది. వర్మ చేసిన కామెంట్లలో కొన్ని....'వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు అవ్వకపోతే వైఎస్ జగన్ కు అన్ని ఓట్లు వచ్చేవా. నాకు తెలియదు. వైఎస్ జగన్ ను పర్సనల్ గా వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే ఎక్కువగా ప్రేమిస్తా. ఆ టైమ్ లో వైఎస్ఆర్ ను నేను ఫాలో అవలా. జగన్ ను నేను ఫాలో అయ్యా. జగన్ బ్రాండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేకుండా వచ్చి ఉండేదా. జగన్ బ్రాండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా ఎలా వచ్చిందో..పవన్ కళ్యాణ్ బ్రాండ్ కూడా అలాగే వచ్చింది. మహేష్ బాబు కూడా అలాగే వచ్చింది. ఫాదర్ పాపులారిటి లేకపోయినా అతనికి ఉన్న అసాధారణ ప్రతిభతో విజయ్ దేవరకొండకు వచ్చింది. అల్లూరి రామలింగయ్య అనే కమెడియన్ ద్వారా...అసాధారణంగా కష్టపడి అల్లు అర్జున్ కు బ్రాండ్ వచ్చింది.
ఏదైనా సరే బ్రాండ్ మీదే నడుస్తుంది. అది అల్లు అర్జున్ అవ్వొచ్చు..మహేష్ బాబు అవ్వొచ్చు. వైఎస్ జగన్ అవ్వొచ్చు. వైఎస్ జగన్ కు జనాలు ఓట్లు వేసింది..వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఏమి ఫీల్ అయ్యారనే అంశంపైనే. ఈ అంశాన్ని జగన్ కూడా చాలా సార్లు ఒప్పుకున్నారు. వైఎస్ ఆర్ లేకపోతే జగన్ ఈ బ్రాండ్ వస్తుందా. నాకైతే తెలియదు. ' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..వైసీపీకి గత ఎన్నికల్లో ఓటు వేసిన వారు మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదంటే పదవులు వదిలిపెట్టి దిగిపోతారా?. అలా జరగదు. వీళ్లకు ఐదేళ్ల సమయం ఉంటుంది ఏమి చేసినా. కానీ సినిమాలకు అలా ఉండదు. ఏమి చేసినా మూడు రోజుల్లో తేలిపోతుంది ఆ సినిమా సంగతి. నేను ఐదు లక్షల రూపాయలతో తీసిన ఐస్ క్రీమ్ సినిమాకు..450 కోట్ల రూపాయలతో తీసిన రాజమౌళి సినిమాకు ఒకే ధర అంటే అర్ధం లేదు. పేదలకు సాయం చేయాలంటే అన్ని రంగాలకు రాయితీలు ఇస్తున్నట్లే సినిమా టిక్కెట్లపై కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తే సరిపోతుంది కదా?. రేషన్ బియ్యం, రేషన్ పంచధార తరహాలో రేషన్ థియేటర్లు తెరిచే ఆలోచన కూడా ఏమైనా ఉందా?.
వీడియోల ద్వారానే కాకుండా ట్విట్టర్ ద్వారా కూడా వర్మ పలు ఏపీ మంత్రి పేర్ని నానికి పలు ప్రశ్నలు సంధించారు. గతంలో కూడా పలు ఛానళ్లలో ఇదే అంశంపై ఏపీ సర్కారు తీరుపై రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. టిక్కెట్ ధర 15 రూపాయలే పెట్టాలి కాబ్టటి..నువ్వు కేవలం 1500 రూపాయలతోనే సినిమా తీయాలని చెబుతారా?. లేక ప్రభుత్వంలో ఒక అసాధారణ సినిమాటోగ్రఫీ మంత్రి అనిల్ యాదవ్, లేకపోతే కొడాలి నాని, వైఎస్ జగన్ వాళ్ళు అందరూ కలసి కెమెరా, ఇవన్నీ వర్క్ చేసి రాజమౌళి కంటే అత్యద్బుతమైన సినిమా తీసి పేద వాళ్లకు 15 రూపాయలు కాదు...ఐదు రూపాయలు కాదు..ఉచితంగానే చూపించండి. మీకు ఆ కెపాసిటీ ఉంటే. ఆ కెపాసిటీ లేకపోతే అలాంటి ప్రతిభ ఉన్న వారిని తక్కువ చేసి చూపించొద్దు. మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అవతలి వారి ప్రతిభను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇది హస్యాస్పదం తప్ప మరొకటి కాదు.' అంటూ వ్యాఖ్యానించారు.