ప్రకాష్ రాజ్ వర్సెస్ నాగబాబు
ఇది టాలీవుడ్ రాజకీయం. ప్రస్తుతం కొంత మంది నటులు అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుంటే..మరికొంత మంది మాత్రం బిజెపికి అనుకూలంగా ఉన్నారు. టాలీవుడ్ లోని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బహిరంగంగానే కెసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఆయన వరస పెట్టి మద్దతులు ఏంటో అర్ధం కావటంలేదని వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నరంటూ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించి..ఆ వెంటనే బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించటం ద్వారా పార్టీ నాయకులు, క్యాడర్ కు పవన్ కళ్యాణ్ ఏమి సంకేతం ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై జనసేన నాయకుడు, నటుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. 'రాజకీయాల్లో అనేక సార్లు నిర్ణయాలు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయం వెనక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్ లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిదన్నారు.
ఇపుడు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. బీజేపీకి సపోర్ట్ చేయడం వెనక.. విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయనేది మా ఉద్దేశ్యం. ఎవడికి ద్రోహం చేసాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ డొల్లతనం ఏంటో సుబ్రహ్మణ్య స్వామి డిబేట్‌లోనే అర్ధమైందన్నారు. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి పెట్టి నార తీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాతో పాటు చాలా మందికి ఇప్పటికీ ఈ సంఘటన గుర్తుంది. నీ ఉద్దేశ్యంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించడంలో ఎలాంటి తప్పులేదు. అదే సమయంలో ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాలి. విమర్శించడం తప్ప మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలం. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీ.. ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా.. బీజేపీ, జనసేన కూటమిని ఆపలేరు. నిర్మాతలకు డబ్బుల కోసం ఎంత హింసకు గురి చేశావో.. ఇచ్చిన డేట్స్ ను క్యాన్సిల్ చేసి ఎంత హింసకు గురి చేసావో...ఇంకా గుర్తువున్నాయి.'అంటూ ఫైర్ అయ్యారు.