రేవంత్ రెడ్డి పై పవన్ ప్రశంసలు
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఎపిసోడ్ పై తొలిసారి స్పందించారు. సోమవారం నాడు ఆయన అమరావతిలోని జనసేన కార్యాలయంలో మీడియా తో చిట్ చాట్ చేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు మంచి గౌరవం ఇచ్చారు అని...రాష్ట్రంలో స్పెషల్ షో స్ తో పాటు రేట్లు పెంచుకోవటానికి కూడా అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ గోటి తో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్న చందంగా మారింది అన్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో రేవతి మృతి పట్ల సినీ పరిశ్రమ మానవత్వంతో వ్యవహరించలేదు అనే ఫీలింగ్ ప్రజల్లో కలిగే పరిస్థితి వచ్చింది అన్నారు. అల్లు అర్జున్ కాకపోయినా...సినిమా అంటే టీం అని...దర్శక, నిర్మాతల తరపున ఎవరైనా వెంటనే కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని చెప్పి ఉండాల్సి ఉందన్నారు. క్షమాపణ చెప్పటానికి కూడా ఎన్నో మార్గాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ మొత్తం అంశంలో అల్లు అర్జున్ ఒంటరి వాడు అయ్యాడన్నారు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అనే కారణంతో అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడు అనే వాదనలో ఏ మాత్రం వాస్తవం ఉండే అవకాశం లేదు అని...ఆ స్థాయిని రేవంత్ రెడ్డి ఎప్పుడు అధిగమించాడు అని...ఆయన కస్టపడి ఈ స్థితికి వచ్చారన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు అని..అల్లు అర్జున్ కాకపోయినా ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నా కూడా పోలీస్ లు తమ పని తాము చేస్తారు అన్నారు. ఒక సారి కేసు నమోదు అయిన తర్వాత ఎవరు ఏమి చేయలేరు అన్నారు. థియేటర్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ టీం మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటె బాగుండేది వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలాగే రేవంత్ రెడ్డి వ్యవహరించ లేదు అని, తెలంగాణ ప్రభుత్వ సహకారం వలనే సలార్, పుష్ప 2 సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయని తెలిపారు.