మోహన్ బాబు ఆహ్వానాన్ని దాచింది ఎవరు?!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు మంగళవారం నాడు తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బహిర్గతం చేశారు. ఇటీవల సీఎం జగన్ దగ్గర జరిగిన సమావేశానికి తన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబుకు ఆహ్వానం ఉందని..అయితే అది కొంత మంది తమకు చేరకుండా చేశారన్నారు. ఈ పని ఎవరు చేశారో కూడా తమకు తెలుసన్నారు. దీనిపై తర్వాత మాట్లాడతానని తెలిపారు. సీఎం జగన్‌తో సినిమా రంగం అంశాలపై మాట్లాడానని, ఏపీలో సినీ పరిశ్రమకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
సినీ ఇండస్ట్రీకి ఏపీ, తెలంగాణ రెండు కళ్లు లాంటివి. తిరుపతిలో స్టూడియో పెడతాం. ఏసియాలోనే బెస్ట్ పిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తా. ఇక రీసెంట్‌గా నేను చేసిన ట్వీట్‌పై కొందరు కావాలనే రాద్దాంతం చేశారు. దయచేసి దుష్ప్రచారం చేయొద్దు అని విష్ణు కోరారు. జగన్ తో సమావేశంలో సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘ చర్చ సాగిందని..ఫిల్మ్ ఛాంబర్ తో పాటు అందరితో కలసి త్వరలోనే సమావేశం అవుతామన్నారు. తనకు టీడీపీలోనూ, వైసీపీలోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు.