Telugu Gateway
Cinema

విలక్షణ నటుడు కోట ఇక లేరు

విలక్షణ నటుడు కోట ఇక లేరు
X

కోట శ్రీనివాస రావు. టాలీవుడ్ లో నటనకు ఆయన ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. నటించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కోట శ్రీనివాసరావు మాత్రం నటనలో జీవించారు అనే చెప్పాలి. కోట శ్రీనివాస రావు కేవలం నటించటమే కాకుండా తనకు ఇచ్చిన పాత్రల్లో జీవించారు అనటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా లో కోట శ్రీనివాసరావు పక్షవాతం వచ్చిన వాడిగా యాక్ట్ చేసిన విధానం చూసిన వాళ్ళు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన అందులో కనిపించిన విధానం అంత వాస్తవికంగా ఉంటుంది మరి. నటించటం ఒక్కటే కాదు..పాత్రలను బట్టి డైలాగులు చెప్పటంలో కూడా కోట శ్రీనివాసరావు కు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఇవన్నీ కలిపే ఆయన్ను టాలీవుడ్ లో ఒక విలక్షణ నటుడిగా నిలబెట్టాయి. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా ఆయన 750 కి పైగా పాత్రలు చేశారు అంటే సాధారణ విషయం ఏమీ కాదు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట శ్రీనివాస రావు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.

కమెడియన్ గా , రాజకీయ నాయకుడిగా..పిసినారిగా ఇలా ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో జీవించి కోట శ్రీనివాసరావు తప్ప మరొకరు ఇలాంటి రోల్స్ పోషించలేరు అనేంతగా తన నటనతో ఆకట్టుకున్నారు. కోట శ్రీనివాసరావు కెరీర్ లో ప్రతిఘటన, అహ నా పెళ్ళంట, గణేష్, గాయం, మనీ, హలో బ్రదర్ వంటి సినిమాల్లో ఆయన రోల్స్ ఎంతో ప్రత్యేకమైనవి. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. తెలుగులో ఆయ‌న చివ‌ర‌గా 2023లో విడుద‌లైన సువ‌ర్ణ సుంద‌రి అనే చిత్రంలో క‌నిపించారు. కోట శ్రీనివాస‌రావు త‌మిళంలో 30కి పైగా చిత్రాల్లో న‌టించ‌గా హిందీలో 10, క‌న్న‌డ‌లో8, మ‌ల‌యాళ‌, డ‌క్క‌న్ భాష‌ల్లో ఒక్కో చిత్రంలో న‌టించారు. అంతే కాదు కొన్ని సార్లు పాటలు కూడా పాడారు.

రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే.. 1999లో భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోట శ్రీనివాసరావు ప్రజాసేవతో మంచి నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు స్వ‌స్థి ప‌లికి సినిమాల‌కే ప‌రిమితం అయ్యారు.ఉత్తమ విలన్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ హాస్య నటుడు ఇలా మొత్తంగా 9 సార్లు ఆయ‌న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌రాష్ట్రంలో ప్ర‌భుత్వం నుంచి నంది పుర‌స్కారాలు అందుకున్నారు. ఆయ‌న సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కు గాను 2015లో భార‌త ప్ర‌భుత్వం నుంచి నాల్గవ అత్యున్నత పౌర పుర‌స్కారం ప‌ద్మ‌శ్రీ కూడా అందుకున్నారు.కోట శ్రీనివాసరావు మూర్తితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.

Next Story
Share it