Telugu Gateway
Cinema

దిల్ రాజు 'డ‌బుల్ గేమ్' దుమారం!

దిల్ రాజు డ‌బుల్ గేమ్ దుమారం!
X

'నేను తెలుగు సినిమా చేయ‌టం లేదు. ' ఇదీ దిల్ రాజు సోమ‌వారం నాడు చేసిన ప్ర‌క‌ట‌న‌. త‌మిళ హీరో విజ‌య్ తో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి తెరకెక్కిస్తున్న సినిమా వార‌సుడు, త‌మిళంలో వారిసు. దీనికి నిర్మాత దిల్ రాజు. టాలీవుడ్ లో ఆగ‌స్టు 1 నుంచి సినిమా షూటింగ్ లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న దాంట్లో దిల్ రాజుది కీలక పాత్ర‌. ఈ విష‌యం ప‌రిశ్ర‌మ‌లోని అంద‌రికి తెలుసు. కానీ ఆయ‌నే ఈ నిర్ణ‌యాన్ని ఉల్లంఘించారు. ఈ సినిమా షూటింగ్ సాగుతున్న అంశానికి సంబంధించిన వార్త‌లు మీడియాలో రావ‌టంతో ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. ఏమిటి అంటే తాను తెలుగు సినిమా షూటింగ్ లు ఏమీ చేయ‌టం లేద‌ని. అంటే మ‌రి దిల్ రాజు ఈ సినిమాను అస‌లు తెలుగు భాష‌లో విడుద‌ల చేయ‌రా? అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌టం ఖాయం. ఎందుకు ఇన్ని ద్వంద ప్ర‌మాణాలు. ప‌రిశ్ర‌మ‌లో నాకు తిరుగులేదు..ఎదురే లేదు అన్నట్లు ఉంది దిల్ రాజు వ్య‌వ‌హారం అన్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కోట్లాది రూపాయ‌ల‌తో ముడిపడిన సినిమా షూటింగ్ ల‌తో ఇలా ఆట‌లాడుకోవ‌టం ఏమిటి అన్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. తెలుగు భాష‌లో విడుద‌ల చేస్తున్న‌ప్పుడు అది తెలుగు సినిమా కాకుండా ఎలా పోతుంది. అస‌లు ఈ ప్ర‌క‌ట‌న‌లో ఏమైనా హేతుబ‌ద్ద‌త ఉందా?. ఇది ఏ మేర‌కు ఆమోద‌యోగ్యం.

సినిమా టిక్కెట్ ధ‌ర‌ల పెంపు ద‌గ్గ‌ర నుంచి ఇలా ప్ర‌తి విష‌యంలోనూ దిల్ రాజు హ‌వా చెలాయిస్తున్నార‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అదే త‌ర‌హాలో అంద‌రి విష‌యంలో షూటింగ్ బంద్ అని చెప్పి ఆయ‌న మాత్రం త‌న సినిమా షూటింగ్ కొన‌సాగించ‌టంపై దుమారం రేగింది. దిల్ రాజుతోపాటు తమిళ హీరో "ధనుష్ " తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగ వంశీ నిర్మాతగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా తెర‌కెక్కుతోంది. వీటిని తెలుగు సినిమాలు కూడా చూడొద్ద‌ట‌. తెలుగు సినిమాలుగా చూడొద్దు అన్న‌ప్పుడు వాటిని తెలుగులో ఎలా విడుద‌ల చేస్తారు అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌టం స‌హ‌జ‌మే క‌దా?. అయితే ఇలా వీళ్ల‌ను పెద్ద‌గా ఎవ‌రూ ప్ర‌శ్న‌లు అడిగే వారుండ‌రు...తాము ఏది చెపితే అదే రైట్ అన‌ట‌మే కాదు.. అంద‌రూ అలాగే అనుకోవాల‌ని డిమాండ్ కూడా చేస్తారు. సినిమా నిర్మాత‌లు అంటే తాము ఏది చెపితే అదే వేదం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు కొంత మంది నిర్మాత‌లు. మ‌రి మిగిలిన వారు దీనిపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it