డ్రగ్స్ కేసు విచారణ...చార్మి వంతు
ఫస్ట్ దర్శకుడు పూరి జగన్నాధ్. ఇప్పుడు చార్మి వంతు వచ్చింది. ఆమె గురువారం నాడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరు అయ్యారు. టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ కుంభకోణంపై ఈడీ తాజాగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా ఉన్న పెడ్లర్ కెల్విన్ ఇప్పటికే ఈడీ అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు నటి చార్మి సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపారని సమాచారం. ఎక్సైజ్ అధికారులకు ఏ మాత్రం సహకరించని కెల్విన్ ఈడీ ముందు మాత్రం జాబితా బయటపెట్టాడు. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్‌తో చార్మి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మీని ప్రశ్నించనున్నారు. 2015-17వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీల వివరాలను కూడా వెంట తేవాలని ఈడీ నోటీసులో పేర్కొంది. చార్మీ ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీయనుంది.
ఇది వరకే పూరి జగన్నాథ్ తన బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ అధికారులు సమర్పించారు. హీరోయిన్‌గా గుడ్‌బై చెప్పిన చార్మి ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి కో ప్రొడ్యూసర్ గా సినిమాలు తెరకెక్కిస్తుంది. 2017లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై చార్మి ఎక్సైజ్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విదేశీ ఖాతాలకు నగదు బదిలీపై పూరి జగన్నాధ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది అంతా సినిమా షూటింగ్ ల కోసం చేసిన చెల్లింపులుగా ఆయన అధికారులకు తెలిపారు. ఈ విచారణ పూర్తయ్యే నాటికి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాల్సిందే.