'కొడాలి నాని' ఎవరో నాకు తెలియదు

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ మంత్రుల తరహాలోనే స్పందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హీరో నాని వ్యాఖ్యలపై వెటకారంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ ధరలను తగ్గించటాన్ని హీరో నాని తప్పుపపట్టారు. ఇదే అంశంపై మీడియా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ప్రశ్నించగా...హీరో నాని ఎవరో తనకు తెలియదని..తనకు తెలిసింది కొడాలి నాని ఒక్కరే అంటూ వ్యాఖ్యానించారు. సినిమా టిక్కెట్ దరలపై ఏపీ సర్కారుపై ప్రశ్నలు సంధిస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా కొడాలి నానిపై మాట్లాడారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 'ఏపీ టిక్కెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కు సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు.
నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ ఒక్కడే. వాళ్లు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు ' అంటూ వ్యాఖ్యానించారు. వర్మ వ్యాఖ్యలపై ఇటీవల కొడాలి నాని స్పందిస్తూ పక్క రాష్ట్రంలో కూర్చుని అక్కడ అక్కడ సినిమాలు తీసుకుంటున్న వాళ్లకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకే తాము జవాబుదారి అని వ్యాఖ్యానించారు. సినిమా టిక్కెట్ ధరల విషయంలో అసలు ప్రభుత్వానికి ఏమి సంబంధం అని మాట్లాడుతున్నారు కదా..సంబందం లేకపోతే మీరే అమ్ముకోండి చూద్దాం అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు వర్మ తాజా ట్వీట్ పై కొడాలి నాని స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.