Telugu Gateway
Andhra Pradesh

కేంద్ర బ‌డ్జెట్ పై వైసీపీ అసంతృప్తి

కేంద్ర బ‌డ్జెట్ పై వైసీపీ అసంతృప్తి
X

బ‌డ్జెట్లు మారుతున్నాయి. కానీ సీన్ ఏమీ మార‌టం లేదు. గ‌త బ‌డ్జెట్ సంద‌ర్భంగా ఏమి చెప్పారో మ‌ళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట‌. కేంద్ర బడ్జెట్ పై ఏపీలోని అధికార వైసీపీ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ అంశంపై ఢిల్లీలో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి, లోక్ స భ‌లో పార్టీ నేత మిథున్ రెడ్డి త‌దిత‌రులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ బూస్టర్ వ్యాక్సిన్‌లా ఉంటుందని భావించామని కానీ బడ్జెట్ నిరుత్సాహపరిచిందని అన్నారు. చూడడానికి స్టైల్‌గా ఉందని, కానీ బడ్జెట్‌లో ఏమీ లేదన్నారు. కేంద్రం సబ్ కా వికాస్ అంటున్నారని, కానీ రాష్ట్రాల మీద ఫోకస్ లేనట్లుగా ఉందన్నారు. వృద్ధి రేటు 9.2 శాతంగా చెప్తున్నారని, ఇది అభినందించదగిన విషయమన్నారు. కేంద్రం ఎఫ్ఆర్‌బీఎమ్ పరిమితి దాటవచ్చని, కానీ రాష్ట్రాలు దాటనకూడదన్న ద్వంద్వ విధానాలున్నాయని ఆయన విమ‌ర్శించారు.

రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామనడం స్వాగతించదగినదన్నారు. కానీ ఏపీకి వచ్చేది నాలుగు వేల కోట్లు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఏపీతో పోలిస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెళతాయని ఆయన తెలిపారు. నదుల అనుసంధానం స్వాగతించదగినదన్నారు. ఆరోగ్య పరికరాలను మెరుగుపరుచుకునేందుకు నిధులు లేవన్నారు. భూమి లేని రైతుల కోసం పథకం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకానికి కేటాయింపులు పెంచలేదన్నారు. కేంద్రం వద్ద 8 లక్షల ఉద్యోగాలు ఉన్నా వాటి ప్రకటన లేదన్నారు. జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్ల పొడిగింపు గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. పంటలకు మద్దతు ధర చట్టబద్దత గురించి ప్రస్తావన లేదన్నారు.

Next Story
Share it