Telugu Gateway
Andhra Pradesh

తిరుపతి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి

తిరుపతి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి
X

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన వెంటనే అధికార వైసీపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. డాక్టర్ ఎం గురుమూర్తి ఆ పార్టీ తరపున బరిలో నిలబడనున్నారు. ఈ మేరకు వైసీపీ అధినేత, సీం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ ఉప ఎన్నిక అంశంపై స్పందించారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా రికార్డ్ సృష్టిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడు లక్షల వరకు మెజారిటీ సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా గెలిచామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఎన్నికలకు సంబంధించిన అన్ని కేసులు క్లియర్ అయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఎస్ఈసీ వెంటనే జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని కోరుతున్నానని పేర్కొన్నారు. అన్ని ఎన్నికలు ఈయన హయాంలోనే పూర్తి కావాలని కోరుతున్నట్లు చెప్పారు. కేవలం 6 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయని, ఈ ఎన్నికలు పూర్తి చేస్తే తాము వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. ఈనెల 18వ తేదీన జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లను నియమిస్తామని, ఇందుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.

Next Story
Share it