సరస్వతి పవర్ లీజులపై రఘురామరాజు కేసు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై వరస పెట్టి కేసులు వేస్తున్నారు. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ సాగుతోంది. మరో వైపు ఏపీలో అమూల్ కు ప్రభుత్వ ఆస్తుల అప్పగింత అంశంపై కూడా కోర్టులో కేసు వేశారు. వీటికి తోడు ప్రతి రోజూ ఏదో ఒక అంశాన్ని తీసుకుని సీఎం జగన్ కు లేఖలు రాస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు చెందిన మరో కంపెనీపై కేసు వేశారు. అదే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మైనింగ్ లీజుల గడువు పొడిగింపు అంశంపైన కేసు వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు పొడిగింపుని సవాల్ చేస్తూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
మైనింగ్ లీజ్‌లో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించిందన్నారు. సీబీఐ కేసును ప్రస్తావించకుండా లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ఆ పిటీషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా రఘురామ కృష్ణరాజు చేర్చారు.