తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారు కానీ ఛానల్ పెడతారా?!

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీలో నెంబర్ టూగా చెలామణి అవుతున్న విజయసాయిరెడ్డి మంగళవారం నాడు మీడియా ముందు విచిత్ర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా విశాఖపట్నం దసపల్లా భూములకు సంబంధించిన దుమారం సాగుతోంది. ఈ భూములపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైసీపీ సర్కారు దీన్ని సెటిల్ చేసింది. విజయసాయిరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ, దసపల్లా భూముల హక్కుదారులతో ఒప్పందాలు చేసుకోవటం..ప్రభుత్వం ఈ భూములను 22ఏ నుంచి తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయటం చకచకా సాగిపోయాయి. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం..నిజంగా విజయసాయిరెడ్డి మీద ఈనాడు తప్పుడు వార్తలే రాసింది అనుకుందాం కాసేపు. నిజానికి ఈనాడు అయినా..మరే ఇతర పత్రిక అయినా తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలి. శిక్షపడేలా చూడాలి. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జగన్ సర్కారు ప్రత్యేకంగా ఓ జీవోను కూడా తెచ్చింది మరి. కానీ విజయసాయిరెడ్డి విచిత్రంగా రామోజీరావు కు పోటీగా తాను సొంత ఛానల్ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ తాను వ్యాపారం చేయలేదని..ఇక వ్యాపారం చేస్తానన్నారు. మరింత ఇరిటేట్ చేస్తే పేపర్ కూడా పెడతానని సవాల్ విసిరారు. అక్కడితో ఆగలేదు ఆయన ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెడతానని ప్రకటించారు. మీడియా రంగంలోకి తానూ వస్తున్నానని..ఇక చూసుకుందామని అంటూ సవాల్ విసిరారు. మాములుగా డబ్బులు ఉంట ఎవరైనా ఛానల్ పెట్టుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి చెప్పిన కారణాలే విచిత్రంగా ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా తనపై ఈనాడుతోపాటు మరికొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని..ఈ విషయంలో తాను సీబీఐ, ఈడీలతోనే కాకుండా ఎఫ్ బిఐపై విచారణకు సిద్ధం అని ప్రకటించారు. విజయసాయిరెడ్డి వైసీపీలో అత్యంత కీలకమైన నేత..నిజంగా ఆయన సీబీఐ విచారణకు సిద్ధపడితే..తనపై వచ్చిన వార్తలపై సీబీఐతో విచారణ చేయించమని ప్రభుత్వాన్ని అడగాలి. లేదంటే వార్తలు రాసిన వారిపై కేసులు పెట్టాలి. అధికారిక పత్రిక సాక్షి కూడా ఈనాడులో వచ్చిన వార్తలకు భారీ ఎత్తున ఖండనలు వేయటంతోనే దీని వెనక ఎవరు ఉన్నారో అర్ధం అయిపోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు. కానీ సహజంగా అత్యంత ఖరీదైన ప్రాంతంలో డెవలప్ మెంట్ ఒప్పందం జరిగితే వాటాలు ఫిఫ్టీ ఫిఫ్టీనో..లేకపోతే సిక్ట్సీ..ఫార్టీనో వాటాలు ఉంటాయి. కానీ ఈ దసపల్లా భూముల డీల్ లో ఒప్పందాలు చూస్తేనే ఇక్కడ ఏదో మతలబు జరిగిందనే విషయం తేలిపోవటం ఖాయం. అంతే కాదు.. ఈ డీల్ జరగటానికి ముందే జరిగిన ఆర్ధిక లావాదేవీలు కూడా కీలకపాత్ర పోషించాయనే విషయం స్పష్టం అవుతోంది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా అడ్డుకునేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. తన కుమార్తె కుటుంబం నిజాయితీగా వ్యాపారం చేస్తుకుంటోందని..రామోజీలా పక్కదారిలో చేయట్లేదన్నారు. మా అమ్మాయి కుటుంబానికి 100 దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి, మా అమ్మాయి కుటుంబం నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు..రామోజీలా పక్కదారిలో చేయట్లేదన్నారు. మా అమ్మాయి కుటుంబానికి 100 దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి, అది దేశంలోనే టాప్ 5 కంపెనీ అని విజయసాయిరెడ్డి తెలిపారు.