Telugu Gateway
Andhra Pradesh

బ్ర‌హ్మానంద‌రెడ్డిని అరెస్ట్ చేయాలి

బ్ర‌హ్మానంద‌రెడ్డిని అరెస్ట్ చేయాలి
X

అధికార వైసీపీ మ‌రో సారి అమ‌మరావ‌తి భూముల అంశాన్ని తెర‌పైకి తెచ్చింది. ఈ వ్య‌వ‌హారంలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడితోపాటు మాజీ మంత్రులు నారాయ‌ణ‌, ప‌త్తిపాటి పుల్లారావుల పాత్ర ఉంద‌ని..దీనికి ఆధారాలు కూడా ఉన్నాయ‌ని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌క్రిష్ణారెడ్డి ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారంపై మ‌రింత లోతుగా విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దళితుల భూములు లాక్కోవడానికి బ్రహ్మానందరెడ్డికి హక్కు ఎక్కడిది?. బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్ చేయాలని సీఐడీని కోరుతున్నా అని రామ‌క్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అండ్‌ కో దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.. అక్రమాలపై ఆయన ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. రైతుల భూములను చంద్రబాబు, నారాయణ బలవంతంగా లాక్కున్నారని.. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.

''అసైన్డ్‌ భూముల లిస్టును రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారు. పథకం ప్రకారం దళితుల్లో భయాన్ని సృష్టించారు. భూముల లిస్ట్ రియల్‌ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక రాజధాని ప్రకటించారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు దళితుల భూములు కొన్నారు. చంద్రబాబు సూచించిన వారి పేర్లను లిస్టులోకి ఎక్కించారు ప్రభుత్వ రికార్డులను మార్చేశారు. సీఆర్ డీఏ ఏర్పడక ముందే ఆనాటి మంత్రుల చేతుల్లోకి భూముల లిస్ట్ వెళ్లింది. తుళ్లూరులో ఒక్క రికార్డు కూడా దొరక్కుండా దొంగతనంగా తీసుకెళ్లారు. నాలుగైదు వేల ఎకరాలను కొట్టేయడానికి ఆనాడు స్కెచ్‌ వేశారు. చంద్రబాబు, నారాయణ కలిసే దళిత సోదరులను మోసం చేశారు. చంద్రబాబు హయాంలో కొందరు అధికారులు స్కామ్‌కు సహకరించారు. అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి' అన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత‌లు మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చారు. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అయ్యాక కూడా ఆధారాలు లేకుండా ఇంకా ఎంత కాలం ఇలా దుష్ప్ర‌చారం చేస్తార‌ని మండిప‌డుతోంది.

Next Story
Share it