విశ్వసనీయత కోల్పోతున్న వైసీపీ
ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య వెనక చంద్రబాబు ఉన్నారనే తరహాలో జగన్ సొంత పత్రిక సాక్షిలో అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచురించింది. కానీ ఈ కేసు ను విచారించిన సిబిఐ అసలు చంద్రబాబు వైపు వేలెత్తి కూడా చూపకుండా..ఇందులో వై ఎస్ భాస్కర్ రెడ్డి, అయన తనయుడు ఎంపీ అవినాష్ రెడ్డి ని నిందితుల జాబితాలో చేర్చింది. వై ఎస్ భాస్కర్ రెడ్డిని ఇదే కేసు లో సిబిఐ అరెస్ట్ కూడా చేసింది. ఈ కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది. ఇక కోడి కత్తి కేసు విషయంలోనూ చంద్రబాబు, టీడీపీ కుట్ర అంటూ ఆరోపణలు గుప్పించారు. సంచలనం రేపిన ఈ కేసును విచారించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాత్రం ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదు అని తేల్చేయటమే కాకుండా..చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. వై ఎస్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు కేసు గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాయనే అంచనాలు ఉన్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి, సజ్జలతో పాటు వైసీపీ కీలక నేతలు అందరూ ఈ విషయంలో చంద్రబాబు పై ఆరోపణలు అయితే చేశారు కానీ...ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. దీంతో వీళ్ళు చేసే కుట్ర ఆరోపణలకు ఏ మాత్రం విశ్వసనీయత లేకుండా పోతుంది అని...వీటిని ప్రజలు నమ్మే అవకాశం కూడా లేదు అని వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. సజ్జల తాజాగా షర్మిల విషయంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఇదే కోణంలో చూస్తారు అని చెపుతున్నారు.