Telugu Gateway
Andhra Pradesh

నిమ్మగడ్డ మూతిపళ్ళు రాలేలా హైకోర్టు తీర్పు

నిమ్మగడ్డ మూతిపళ్ళు రాలేలా హైకోర్టు తీర్పు
X

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు స్పందించారు. ఎప్పటిలాగానే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ, మంత్రులు నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ 'హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతారా?చంద్రబాబు ఇంటికెళతారా? చెప్పండి ప్లీజ్ ' అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ఘాటుగా విమర్శలు గుప్పించారు. 'హైకోర్టు తీర్పు కుక్క కాటుకు చెప్పు దెబ్బలా, నిమ్మగడ్డ మూతి పళ్లు రాలేలా తీర్పు వచ్చింది' అని మంత్రి కొడాలి వ్యాఖ్యానించారు. కోవిడ్ ప్రబలి ప్రజలు చనిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని నిమ్మగడ్డ చూశారని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలు అమలు చేసిన వ్యక్తి నిమ్మగడ్డ అని.. రాజ్యాంగ పదవిలో ఉండి ఆ పదవికి చేటు తెచ్చిన వ్యక్తి నిమ్మగడ్డ అని కొడాలి నాని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నైతిక బాధ్యతతో నిమ్మగడ్డ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో వ్యాక్సినేషన్ క్యార్యక్రమంతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వం చూస్తోందని, త్వరలోనే కోవిడ్ వారియర్స్‌కి వ్యాక్సిన్ ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ ఇది రాష్ట్ర ప్రజల, కోవిడ్ వారియర్స్ విజయం అని వ్యాఖ్యానించారు. దేశం అంతా కోవిడ్ వ్యాక్సిన్ పై దృష్టి పెట్టిన సమయంలో అంత అత్యవసరంగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్‌ను హై కోర్టు సస్పెండ్ చేయటం ప్రజా విజయం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఇది నియంతృత్వ పోకడలకు పోయే రాజ్యాంగేతర శక్తులకు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ప్రజావిశ్వాసం పొందిన సీఎం జగన్‌ని కుట్రలతో ఎదుర్కొవాలనుకోవాలనుకోవడం మూర్ఖత్వం అని తెలిపారు.

Next Story
Share it