సినిమాలో ఉన్నది వేరు..ప్లకార్డు పై పెట్టింది వేరు

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూరమైన ప్రజలను దగ్గర చేసుకోవటం ఎలా అన్న అంశంపై కంటే...వాళ్ళను మరింత భయపెట్టడం ఎలా?. పొరపాటున కూడా వాళ్ళు మళ్ళీ వైసీపీ వైపు చూడకుండా చేసుకోవటం ఎలా అన్న అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన వైఖరి చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలగటం సహజం. సినిమాలు ఉన్నది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయటం కోసం. రాజకీయం అలా కాదు కదా?. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే వాళ్లకు మేలు చేసేలా పాలన చేయటం కోసం...రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడపటం కోసం. అంతే కానీ పదే పదే ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి సినిమాలో డైలాగులు వాడితే తప్పేంటి?.తప్పు అయితే వీటికి సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతి ఇచ్చింది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లు సినిమాల్లో ఇంత కంటే దారుణమైన డైలాగులు చెపుతారు కదా అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా జగన్ చెప్పినట్లు పుష్ప 2 సినిమాలో ఆయన టూర్ లో ప్లకార్డు మీద ప్రదర్శించినట్లు ‘2029 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని ...’. అని ఎక్కడా లేదు.
ప్రజలు అధికారం ఇచ్చేది పాలించటానికి..జనాన్ని నరకడానికి కాదు. సినిమా డైలాగు కు కార్యకర్తలు యాడ్ చేసిన అంశాలను జగన్ మోహన్ రెడ్డి చాలా కన్వీనెంట్ వదిలేసి సినిమా డైలాగులు చెపితే తప్పా..దీనికి కూడా కేసులు పెడతారా అంటూ మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు యాడ్ చేసిన అంశాలను మాత్రం వదిలేస్తున్నారు. మరో వైపు జగన్ కొద్ది రోజుల క్రితం తన కారు కింద పడి చనిపోయిన సింగయ్య భార్యను తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడటం కూడా పెద్ద దుమారం రేపింది. ఎవరైనా బాధితులను వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు కానీ..వాళ్ళను తన ఇంటికి పిలిపించుకుని పరామర్శించటం జగన్ రాజకీయాల్లో ఒక వెరైటీ.
ఇక్కడ మరో కీలక అంశం ఏమిటి అంటే ఇదే అంశానికి సంబంధించి జగన్ పై హై కోర్ట్ లో కేసు నడుస్తున్న వేళ జగన్ తన ఇంటికి సింగయ్య భార్యను పిలిపించుకోవటం దుమారం రేపింది. ఇవన్నీ కూడా రాజకీయంగా వైసీపీ కి నష్టం చేసేవే తప్ప..ఏ మాత్రం ఉపయోగపడేవి కాదు అని వైసీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం జగన్ రాజకీయ పర్యటనలను అడ్డుకుంటే అదే విషయాన్ని ప్రజలకు చెప్పొచ్చు. టీడీపీ తరహాలోనే ఆయనకు మీడియా మద్దతు తక్కువ ఏమి లేదు. అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చు.. కానీ జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టాల్సిన అంశాలను వదిలేసి అనవరసమైన విషయాలపై ఫోకస్ పెడుతున్నారు అనే చర్చ వైసీపీ నేతల్లో కూడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా జగన్ ఇదే తీరుగా వ్యవహరిస్తే రాజకీయంగా భారీ నష్టం తప్పదు అనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం మరో మూడున్నర ఏళ్ళు...మూడేళ్లు ఆగితే తిరిగి తనదే అధికారం అని తనను తాను నమ్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.



