Telugu Gateway
Andhra Pradesh

ఇరకాటంలో వైసీపీ

ఇరకాటంలో వైసీపీ
X

అధికార వైసీపీ ఏదో అనుకుంటే మరేదో అయింది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ని ఇరకాటంలోకి పెట్టాలని ప్రయత్నించి తానే ఇరకాటంలో పడింది. తొలుత అమరావతి రాజధానికి ఒప్పుకుని తర్వాత మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్న సీఎం జగన్ వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో పెండింగ్ లో ఉంది. ఈ తరుణంలో అధికార వైసీపీ ట్విట్టర్ ఖాతా నుంచి శనివారం రాత్రి ఒక ట్వీట్ పోస్ట్ అయింది. అందులో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి , సీఎం జగన్ రుషికొండ పై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతుంటే ..దాని మీద తెలుగు దేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. ఇది చూస్తుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం టీడీపీ కి ఇష్టంలేనట్లు ఉంది అంటూ ఆ ట్వీట్ లో ప్రస్తావించారు. ఇంత కాలం అవి సీఎం కోసం కాదు కేవలం పర్యాటక శాఖ భవనాలు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏకంగా పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి అది సచివాలయం అని చెప్పటంతో దుమారం చెలరేగింది. ఒక వైపు కేసు సుప్రీం కోర్ట్ లో కేసు ఉంటే ప్రభుత్వం వైజాగ్ లో సెక్రటేరియట్ ఎలా కడుతుంది అని ప్రశ్న తెరపైకి రావటం ఖాయం. అందుకే మళ్ళీ రంగంలో దిగి ట్వీట్ లో పొరపాటున రుషికొండ లో సెక్రటేరియట్ అని ప్రస్తావించాం అని..పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తున్నట్లు గా దీన్ని సవరించుకోవాలంటూ పేర్కొన్నారు.

పైకి పర్యాటక శాఖ పేరు చెపుతున్నా ఇవి సీఎం జగన్ కోసమే నిర్మిస్తున్నారు అనే ప్రచారం అటు వైసీపీ వర్గాలతో పాటు...అధికార వర్గాల్లోనూ ఉంది. రేపు దసరా కు సీఎం జగన్ వైజాగ్ కు షిఫ్ట్ అయి రుషికొండ కు వెళితే అప్పుడు ఖచ్చితంగా చిక్కులు వస్తాయనే చర్చ కూడా సాగుతుంది. వైసీపీ ట్వీట్ పెద్ద ఇరకాటమే తెచ్చిపెట్టినట్లు అయింది. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని అయినా సీఎం జగన్ తన క్యాంపు ఆఫీస్ గా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక పేరు చెప్పి నిర్మాణాలు చేపట్టి..మరో అవసరానికి వాడితే ప్రభుత్వమే ఏదో దొంగతనంగా పనులు చేసినట్లు అవుతుంది కదా అని ఒక అధికారి సందేహం వ్యక్తం చేశారు. వైసీపీ శాసనరాజధానిగా ప్రకటించిన అమరావతి లో నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా అక్కడ మాత్రం ఒక్క పని కూడా మొదలుపెట్టని సీఎం జగన్..వైజాగ్ లో మాత్రం పర్యాటక శాఖ పేరుతో భారీ ఎత్తున కొత్త నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇవి ఎందుకు అనే విషయం భవిష్యత్తులో అయినా ప్రజలకు తెలియదా...అప్పుడు ప్రభుత్వ బండారం బయటపడదా. తొలుత వైసీపీ చేసిన ట్వీట్ లో గతంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీ నాయకులే 450 ఎకరాలు దోచుకున్నారు అని అనలేదా అంటూ ప్రశ్నించారు.

Next Story
Share it