వైసీపీదూకుడు..వైఖరి మారిందా..తాత్కాలికమా?
అధికార వైసీపీ తన వైఖరి మార్చుకుందా?. కేంద్రంలో ఇక బిజెపితో అమీతుమీకి సిద్ధం అవుతుందా?. లేక ఇది తాత్కాలిక వ్యవహరమేనా?. ఆదివారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి గతానికి భిన్నంగా బిజెపిపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలను బిజెపి వంచిస్తోంది అంటూ ధ్వజమెత్తారు. దానికి కొనసాగింపుగా అన్నట్లు సోమవారం నాడు పార్లమెంట్ లోనూ దూకుడు చూపించారు. రాజ్యసభలో ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి పోడియం దగ్గరకు వెళ్ళి మరీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్ సభలో కూడా పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలంటూ కూడా నిరసనకు దిగారు. ఉభయ సభలు తొలిరోజే వాయిదా పడటంలో వైసీపీ సభ్యుల ఆందోళన కూడా ఓ కారణమే. పలు పార్టీలు ఒక్కో అంశంపై చర్చకు పట్టుపడుతూ ఆందోళన బాట పట్టాయి. అయితే వైసీపీలో ఈ సడన్ మార్పు ఏంటి?. అసలు ఏమి జరుగుతోంది అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
అటు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మొదలుకుని ఇప్పటి వైసీపీ సర్కారు వరకూ ఆంధ్రప్రదేశ్ కు బిజెపి వరస పెట్టి హ్యాండ్ ఇస్తూ పోతూనే ఉంది. విచిత్రం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విష యంలో ఏమీ చేయలేమని..కేంద్రాన్ని అడుగుతూ ఉండటం తప్ప చేసేదేమీలేదన్నారు. దేవుడు కరుణిస్తే ఎప్పుడో ఓ సారి ప్రత్యేక హోదా వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సారి అందుకు భిన్నంగా పార్లమెంట్ వేదికగా వైసీపీ ఎంపీలు పలు అంశాలపై ఆందోళనకు దిగటం..దూకుడు ప్రదర్శించటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే వైఖరిని రాబోయే రోజుల్లో కూడా ప్రదర్శిస్తారా? లేక ఇది తాత్కాలిక వ్యవహారమేనా అన్నది తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. ఓ వైపు విభజన హామీలు అమలు చేయకుండా..ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పటం ఒకెత్తు అయితే..మద్యలో వైజాగ్ స్టల్ ప్రైవేటీకరణ అంశం కూడా ఓ రాజకీయ అంశంగా మారిన విషయం తెలిసిందే.