ఎత్తి బయటపడేయండి..టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు కూడ సేమ్ సీన్. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నించటం, అధికార పార్టీ ఎదురుదాడి చేయటం కామన్ గా మారిపోయింది. అయితే మంగళవారం నాడు సభా కార్యకలాపాలకు అడ్డుకుంటున్నారనే కారణంతో పాలకొల్లు టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును ఒకరోజు పాటు స్పీకర్ సస్సెండ్ చేశారు. టిడ్కో ఇళ్ళ అంశంపై చర్చ జరపాలని టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ తీరుపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీళ్ల తీరు చూస్తుంటే వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం వస్తోంది అధ్యక్షా అని వ్యాఖ్యానించారు. మరోసారి ఇలాగే చేస్తూ ఉంటే మార్షల్స్ ను పిలిచి ఎత్తి బయటపడేయండి అన్నారు.
టీడీపీ ఆందోళనను అధికార పార్టీ తప్పుపడుతూ కీలక బిల్లులు ఉన్నాయని సభ సజావుగా సాగటానికి సహకరించాలని కోరారు. టీడీపీ సభ్యులు పొడియం ముందు నిలబడి నినాదాలు చేస్తూ సభలో నిలుచున్నారు. ఎంతకీ వివాదం సద్దుమణగకపోవడంతో స్పీకర్ అసెంబ్లీని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. 'జగన్ మాట చెప్తే చేసి చూపిస్తాడు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుంది. మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలను ఇవ్వగలిగాం. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశాం. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు.
టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావ'ని సీఎం జగన్ అన్నారు. అంతకు ముందు హౌసింగ్‌పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వమే అజెండాలో పెట్టినందున వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయినప్పటీకి టీడీపీ సభ్యులు పట్టువీడకుండా సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలా గందరగోళం సృష్టించడం సమంజసం కాదని హితవు పలికారు.