Telugu Gateway
Andhra Pradesh

దూరం పెట్టారా...దూరం జరిగారా?!

దూరం పెట్టారా...దూరం జరిగారా?!
X

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ నేతలు, క్యాడర్ లో ఇప్పుడు ఇదే చర్చ. గత కొంత కాలంగా విజయసాయిరెడ్డి ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా పాల్గొంటున్న దాఖలాలు లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ తర్వాత నంబర్ టూగా ఉంటూ అన్ని అంశాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత, పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సీఎం జగన్ దగ్గర జరిగే కీలక సమావేశాల్లో కూడా పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ లో ఒకింత కలకలం రేపుతున్నాయి. ఈ తరుణంలో సీఎం జగన్ సోమవారం నాడు తాడేపల్లి లో పార్టీ కీలకనేతలు వై వీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లతో సమావేశం అయ్యారు. . రాజ్యసభ రెన్యువల్ కు ముందు కూడా సీఎం జగన్, విజయసాయిరెడ్డి ల మధ్య గ్యాప్ వచ్చింది అంటూ పార్టీ నాయకుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయనకు రెండవసారి రెన్యువల్ కూడా ఉండదు అంటూ చాలా మంది నేతలు చెప్పారు. కానీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యవహరించి రెండవసారి కూడా విజయవంతంగా రాజ్యసభ దక్కించుకున్న్నారు. ఆ తర్వాత కొంతకాలం యాక్టీవ్ గా ఉన్నా అయన మళ్ళీ సడన్ గా కొద్దిరోజుల నుంచి పార్టీ వ్యవహారాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా పాల్గొనటం లేదు అనే చర్చ సాగుతోంది.

సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలో తప్ప విజయసాయిరెడ్డి రాష్ట్రంలో మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అని ఆ పార్టీ నాయకులే చెపుతున్నాడు. అయితే దీని వెనక ఉన్న కారణం ఏంటో అన్నది ఎవరికీ తెలియదు. నందమూరి తారక రత్న మరణించిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బాలకృష్ణలతో ఎంపీ విజయసాయిరెడ్డి సన్నిహితంగా మెలిగిన అంశంపై సందర్భాన్ని కూడా పట్టించుకోకుండా వైసీపీ సోషల్ మీడియా, కొంత మంది టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా తప్పు పడుతూ పోస్ట్లులు పెట్టారు. కారణాలు ఏమైనా కూడా విజయసాయిరెడ్డి వైసీపీ లో అంత చురుగ్గా ఉండకపోవటం ఒకెత్తు అయితే...గతంలో లాగా ప్రతిపక్ష పార్టీలపై ట్వీట్ల దాడి కూడా పూర్తిగా తగ్గించారు. ఇవి అన్ని కూడా ఇప్పుడు వైసీపీ నాయకుల్లో హాట్ టాపిక్ గా మారాయి. . విజయసాయి రెడ్డి కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్న వేళ అయన ప్లేస్ లో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా మారుతున్నారు అని పార్టీ నాయకులు చెపుతున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా జగన్ దగ్గర ఎంత కలం ఉంటుందో చూడాలి అని ఒక వైసీపీ కీలకనేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it