పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టించుకోని జగన్
ప్రాంతీయ పార్టీల్లో ఏ నిర్ణయం అయినా అధినేత ఇష్టానుసారమే ఉంటుంది. ఆయా పార్టీల అధినేతలు తమ తమ విధానాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం అనే చెప్పొచ్చు. వైసీపీ లో అధినేత నిర్ణయాలను ఎక్కువగా ఐ ప్యాక్ ప్రభావితం చేస్తుంది అని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీ లు అన్నీ కూడా రాజకీయ సేవల కోసం వ్యూహాకర్తలను నియమించుకుంటున్నాయి. ప్రతి పార్టీ కూడా ఈ మోడల్ ను ఫాలో అవుతుంది. అయితే వైసీపీ విషయానికి వచ్చేటప్పటికి ఆ పార్టీ నిర్వహణలో కూడా ఐ ప్యాక్ పాత్రే చాలా చాలా ఎక్కువగా ఉంది అన్నది వైసీపీ నాయకులు చెపుతున్న మాట. ఐ ప్యాక్ ప్రభుత్వానికి సంబంధించిన పలు విషయాల్లో కూడా జోక్యం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. స్కీమ్ ల అమలుతో పాటు ...పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలి వంటి విషయాలకు కూడా ఐ ప్యాక్ టీం సలహాలు, సూచనలే కీలకం అని చెప్పొచ్చు. పార్టీ నిర్వహణ విషయంలో కూడా నేతల సలహాలు, సూచనల కంటే ఐ ప్యాక్ ప్రభావమే ఎక్కువ అనే చర్చ ఆ పార్టీ నేతల్లోనే ఉంది.
అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖరారు తో పాటు వ్యూహాల అమలు బాధ్యతను కూడా ఐ ప్యాక్ చూసుకుంటుంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ ని నడిపే విషయంలో కూడా వైసీపీ లోని సీనియర్ నేతల మాటల కంటే ఐ ప్యాక్ సూచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ఎవరూ కాదనలేని సత్యం అని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీ లోని కొంత మంది కీలక నేతలు ఐ ప్యాక్ టీం లతో మాట్లాడుకుని కొంత మంది అభ్యర్థుల విషయంలో కూడా మార్పులు చేర్పులు చేయించటంలో విజయవంతం అయినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. వైసీపీ వ్యవహారంలో ఏ జిల్లాలో సమస్యలు తలెత్తినా...ఎంత పెద్ద సీనియర్ నాయకులకు ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళు నేరుగా పార్టీ అధినేత గా ఉన్న జగన్ ను కలిసే ఛాన్స్ ఉండదు. ఏ విషయం ఆయినా పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పరిష్కారం కావాల్సిందే. లేక పోతే సీఎంఓ లో పార్టీ వ్యవహారాలు చూసే కొంత మంది ఐఏఎస్ ల దగ్గర పంచాయతీ జరుగుతుంది. మరీ తప్పని సరి అయితేనే తప్ప ఎవరికీ జగన్ ను కలిసే ఛాన్స్ రాదు అని చెప్పొచ్చు. దీంతో వైసీపీ అంటే తెర వెనక ఐ ప్యాక్...తెర ముందు సజ్జల రామకృష్ణారెడ్డి అనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో ఉంది.
గత ఐదు సంవత్సరాలుగా అటు ప్రభుత్వ వ్యవహారం ఆయినా...పార్టీ విషయం ఆయినా కూడా మీడియా ముందు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కనిపించిన సంగతి అందరూ చూసింది. ఈ విషయంలో సీనియర్ మంత్రులు...సీనియర్ నేతలకూ ఎప్పుడో తప్ప ఏ మాత్రం ఛాన్స్ ఉండదు. వైసీపీ అధినేత జగన్ తీరు ఎంత దారుణంగా ఉంటుంది అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా వైసీపీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగరవేయటానికి కూడా పార్టీ అధినేత అయిన జగన్ బయటకు రారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. చివరకి ఎన్నికల ఏడాది అయిన 2024 మార్చి 12 న జరిగిన ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా అదే సీన్ రిపీట్ అయింది. జగన్ లేకుండా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మరి కొంత మంది నేతలు కలిసి ఈ కార్యక్రమం పూర్తి చేశారు. దీంతో పార్టీ నడిపే విషయంలో జగన్ ఎంత సీరియస్ గా ఉంటారో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.