కూతురికి రాజ్య సభ కోరిన మాజీ ఎంపీ..బీజేపీ నో!

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ కు రంగం సిద్ధం అవుతోంది. ఆయన బీజేపీ లో చేరటానికి అంతా సిద్ధం అయింది. అంతే కాదు పార్టీలో చేరిన తర్వాత ఆయన కు అప్పగించాల్సిన బాధ్యతల విషయంలో కూడా ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.. దీని ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాష్ట్రానికి ఆయన్ను పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇంకా పార్టీ లో చేరక ముందే ఆయనకు ఇచ్చే పదవిపై బీజేపీ అధిష్ఠానం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది అంటే బీజేపీ పెద్దల దగ్గర ఆయన పరపతి ఏ స్థాయిలో ఉందొ అర్ధం అవుతోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరో వైపు విజయసాయి రెడ్డి తన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్య సభ సీటు తన కుమార్తె నేహా రెడ్డి కి ఇవ్వలసిందిగా బీజేపీ అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టగా దీనికి మాత్రం నో చెప్పినట్లు సమాచారం .
అయితే బీజేపీ అధిష్టానం తిరిగి విజయసాయి రెడ్డికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆయనకు తమిళనాడు బాధ్యతలు అప్పగిస్తుందా...లేక ఈ సీటు వేరే వాళ్లకు కేటాయిస్తారా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అని చెపుతున్నారు. బీజేపీ అధిష్ఠానం విజయసాయి రెడ్డి కి తమిళనాడు బీజేపీ బాధ్యతలు అప్పగిస్తే రాజకీయాల్లో అది పెద్ద సంచలనంగా మారటం ఖాయం. వైసీపీలో ఒకప్పుడు నంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఆయన కోటరీ చేతిలో చిక్కుకుపోయారు అని సంచలన వ్యాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా జగన్ హయాంలో సాగిన పలు కుంభకోణాలకు సంబంధించి విజయసాయి రెడ్డి అనధికారిక అప్రూవర్ గా మారారు అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కాకినాడ పోర్ట్ వ్యవహారంతో పాటు లిక్కర్ స్కాం విషయంలో కూడా ఆయన ఇటీవల బహిరంగ వ్యాఖ్యలు చేసి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపారు . వైసీపీకి , రాజసభకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి ఇక తాను వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఏ పార్టీ లో చేరాను అని అధికారికంగా ప్రకటించారు .
కానీ కొద్దీ రోజులకే ఆయన బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అయి పోయారు. ఇదిలా ఉంటే ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయసాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీ భర్తీకి సీఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఈ నెల 22 నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా, మే 9 న రాజ్యసభ స్థానానికి ఎన్నిక, ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ లో ఇప్పుడు ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది తప్ప ఎన్నికకు ఛాన్స్ లేదు.